సాధారణంగా ఇంటి అందాన్ని పెంచేవాటిలో రంగులు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వీటిలో కర్టెన్ల స్థానంకూడా చాలా ఉత్తమంగానే ఉంటుంది. కొందరికి గోడకున్న రంగుతో తగిన రంగులు గల కర్టెన్లను అలంకరిస్తే బాగుంటుంది. కొందరికి లేతరంగులు చక్కగా నప్పుతాయి. లేకుంటే ఆకుపచ్చ, సముద్ర నీలం రంగుల్లోని వివిధ ఛాయలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రకృతి అందాలకు ప్రతీరూపాలుగా నిలుస్తాయి.
మీరు ఇంట్లో వాడే ఫర్నిచర్‌ను బట్టి కూడా కర్టెన్లను ఎంచుకుంటే బాగుంటుంది. మీరు తీసుకునే ఈ చిన్ని జాగ్రత్తతో గది మరింత అందంగా కనిపిస్తుంది.
ప్రత్యేక సందర్భాలకైతే.. ఇల్లంతా ఒకే రంగున్న కర్టెన్లను వేలాడదీసి చూడండి. ఎంతో హుందాగా ఉంటుంది.
గాజుతో చేసిన కిటికీలు, తలుపులకు ముదురు రంగువి, కాస్త మందంగా ఉన్న పరదాలను వేలాడదీయండి.
ఒకసారి వేసిన పరదాలను ఏళ్లకేళ్లు అలాగే ఉంచేయాలనుకోవడం పొరబాటు. కాలానుగుణంగా వీటిని మారుస్తూ ఉండాలి.
వర్షాకాలంలో అయితే సులువుగా శుభ్రపరిచేలా తేలికపాటివి, ముదురు వర్ణాలకు ప్రాధాన్యమివ్వండి.
చలికాలంలో కొంచెం మందంగా ఉన్నవాటిని ఎంచుకుంటే.. చలినుంచి తప్పించుకోవచ్చు.
అదే వేసవి కాలంలోనయితే లేతరంగులు చక్కగా ఉంటాయి.
మీ అభిరుచికి తగ్గ రంగులు, డిజైన్లు మీకు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది ఓ సారి చూసుకోండి. లేదా సాదా వస్త్రాన్ని విడిగా తీసుకుని మీకు నచ్చిన డిజైన్‌లో కుట్టుకుని గదులకు, కిటికీలకు పరదాలను అలంకరించుకోవచ్చు.
మీ ఆసక్తి ఉంటే పేయింటింగ్ కూడా వేసుకోవచ్చు. వాటిపై కుట్లు, అల్లికలు, మెరుపులతోకూడిన డిజైన్లు అదనపు హంగులుగా మార్చి మీ ఇంటి అందాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దండి.