గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్ధరించాలని భారత్, పాకిస్థాన్ హాకీ సమాఖ్యలు నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల్లోని వేదికలపై సిరీస్‌లను నిర్ణయించేందుకు తేదీలను సైతం హాకీ సమాఖ్యలు ఖరారు చేశాయి.
హాకీ సమాఖ్యలు తీసుకున్ని ఈ నిర్ణయంలో భాగంగా భారత జూనియర్ హాకీ జట్టు ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా పాక్‌లో పర్యటించనున్న భారత జూనియర్ హాకీ జట్టు ఐదు టెస్టులు ఆడుతుందని హాకీ సమాఖ్య తెలిపింది.
అలాగే ఈ ఏడాది డిసెంబర్‌లో పాకిస్థాన్ సీనియర్ హాకీ జట్టు భారత్‌లో పర్యటించనున్నట్టు పాక్ హాకీ సమాఖ్య కార్యదర్శి అసిఫ్ బజ్వా తెలిపారు. దీంతో పాటు వచ్చే ఏడాది జనవరి 31నుంచి భారత్‌లోని చండీగఢ్‌లో జరగనున్న నాలుగు దేశాల హాకీ టోర్నీలో పాకిస్థాన్ జట్టు పాల్గొననుంది.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌లతో పాటు జర్మనీ, హాలెండ్ దేశాలు పోటీపడనున్నాయి. కొద్దిరోజుల క్రితం బీజింగ్ వేదికగా జరిగిన ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న పాకిస్థాన్ హాకీ జట్టు ప్రారంభంలోనే ఇంటిముఖం పట్టాగా ఈ టోర్నీకి భారత హాకీ జట్టుకనీసం అర్హత కూడా సాధించలేక పోవడం గమనార్హం.
దీంతో ఇరు దేశాల హాకీ సమాఖ్యలు తమ జట్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.