శొంఠి, జీర్ణశక్తికి బాగా పని చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో తగినంత చేర్చుకుంటే చాలా మంచిది. కడుపులో నులిపురుగుల నివారణకు ఇది ఉపకరిస్తుంది. తలనొప్పి వస్తే శొంఠి నీటిలో అరగదీసి కణతలకు, నుదురుకు పట్టించాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. శొంఠి పొడి, మిరియాలు, పిప్పళ్లు (త్రికటు) వీటిని తేనెతో కలిపి గాని లేదా టీ మాదిరిగా మరిగించి తీసుకుంటే ఆయాసం తగ్గుతుంది. శొంఠి కషాయం చేసుకుని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలంలో కషాయమంటే ఇష్టంలేని వాళ్లు జలుబును దూరం చేసుకోవాలంటే శొంఠి కాఫీని ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
శొంఠి - 50గ్రాములు
ఏలకులు - 5,
బెల్లం - 50 గ్రాములు
పాలు - ఒక కప్పు
తయారీ విధానం :
ముందుగా శొంఠి, ఏలకులను పౌడర్‌లా మిక్సీలో కొట్టిపెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో ఒక కప్పు నీరు పోసి పొడి చేసిన శొంఠి, ఏలకుల పొడిని రెండు స్పూన్లు చేర్చి, అందులో బెల్లం కూడా తగినంత కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరిగాక స్టౌ మీద నుంచి దించి ఫిల్టర్ చేసుకోవాలి. మరో పాత్రలో పాలు కాచుకుని రెండింటిని మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.