కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీలో ఓ భాగమైన భారత వాయుసేన అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు శత్రుసేనలపై బాంబుల వర్షం కురిపించాయి. ఫలితంగా శత్రుసేనలు ప్రాణాలు రక్షించుకునేందుకు చెల్లాచెదురైపోయాయి. ముఖ్యంగా, ఈ యుద్ధంలో వాయుసేనకు చెందిన మిరాజ్ 2000 రకం యుద్ధం ఓ బెబ్బులిలా రెచ్చిపోయింది.
దొంగచాటుగా భారత భూభాగంలోకి పాకిస్థాన్ సైన్యం ప్రవేశించినట్టు భారత ఆర్మీ గుర్తించింది. దీంతో తక్షణం వెనుదిరిగిపోవాల్సిందిగా భారత సైన్యం పదేపదే హెచ్చరికలు చేసింది. కానీ, పాకిస్థాన్ సైనికులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో భారత్ సైనిక చర్యకు దిగాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం ఆపరేషన్ విజయ్ పేరుతో 1999, మే 3వ తేదీన భారత సైన్యం యుద్ధానికి శ్రీకారం చుట్టింది.
పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొంటూనే మరోవైపు అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు భారత ఆర్మీ తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్.. 'ఆపరేషన్ సఫేద్ సాగర్' పేరుతో భారత వాయుసేనను రంగంలోకి దించింది.
అయితే 32 వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్‌ఫోర్స్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో దెబ్బతిన్న బెబ్బులిలా లేచిన వాయుసేన మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా శత్రవులపై బాంబుల వర్షం కురిపించింది.
భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. ఫలితంగా సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికితోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.
మన సైనికుల వీర పోరాటంతో హిమాలయ పర్వతసానుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు.
పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 3 వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న "విజయ్ దివస్" నిర్వహిస్తోంది.. 20వ 'విజయ్ దివస్' వేళ మనమూ వీరసైనికుల త్యాగాలను స్మరించుకుందాం.