తులసిలో ఏముంది...? ఆరోగ్యానికి ఎంతమేరకు ఉపయోగపడుతుంది..?

తులసి ఆకులను కోసిన వెంటనే పరీక్షించితే చాలా పోషక విలువలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. పిండి పదార్థములు 60.95, మాంసకృతులు 14.37, ఖనిజ లవణాలు 14.27, నీరు 6.43, కొవ్వు పదార్థములు 3.98 గ్రామముల పోషకాలు 100 గ్రాముల తాజా తులసి ఆకుల్లో ఉంటాయి. తులసి ఆకులు

గురువారం, 7 ఏప్రియల్ 2016 (17:53 IST)
తులసి ఆకులను కోసిన వెంటనే పరీక్షించితే చాలా పోషక విలువలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. పిండి పదార్థములు 60.95, మాంసకృతులు 14.37, ఖనిజ లవణాలు 14.27, నీరు 6.43, కొవ్వు పదార్థములు 3.98 గ్రామముల పోషకాలు 100 గ్రాముల తాజా తులసి ఆకుల్లో ఉంటాయి. తులసి ఆకులు ఎండిన కొద్దీ పోషక విలువలు తగ్గుతుంటాయి. కొన్ని రకాల తులసి ఆకుల్లో పీచుపదార్థాలు కూడా ఉంటాయి. కాల్షియం, సోడియం, పొటాషియం, ఇనుము, భాస్వరం లాంటి ఖనిజ లవణాలు వుంటాయి.
 
రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం.తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు.
 
అనాదిగా తులసి చెట్టు నీ శ్రీమహాలక్ష్మి ప్రతిరూపంగా భావిస్తూ పూజిస్తున్నారు. తులసి చెట్టు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రం. మొక్కలలో తులసికి ఉన్న ప్రాధాన్యం మరే చెట్టుకు లేదు. తులసి వలన అనేక రకాలుగా ఆరోగ్య పరంగా లాభాలు ఉన్నాయి. తులసి రసానికి కఫాన్నే తగ్గించే లక్షణం ఉన్నది. రోజు తులసి ఆకులు తింటే కేన్సర్ వంటి రోగాలు రావనీ వైద్యులు చెబుతారు. తులసివనంలో విహరించిన అనారోగ్యం దరిచేరనివ్వదు.
 
ఆరోగ్యం బాగానే ఉన్నా, వాతావరణ కాలుష్యాల వల్ల కూడా కొందరి ముఖం మీద కొన్ని మచ్చలు ఏర్పడవచ్చు. వీటిని నివారించడంలో తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. బ్యాక్టీరియాను నశింపచేసే లక్షణం ఉన్నందున, ఆరోగ్య పరిరక్షణలో అనాదిగా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం వేళ కాసేపు తులసి ముందు కూర్చుని ఆ వాసనను బలంగా పీలిస్తేనే రక్తశుద్ధి అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాంటిది కడుపులోకి నేరుగా ఆ రసాన్ని, లేదా ఆకు ముద్దను తీసుకుంటే ఇక చెప్పేదేముంది!
 
తులసి మొక్కలున్న పరిసరాల్లో దోమలు, విష కీటకాలు చేరవు. ఇది వున్న ప్రదేశాలకు పాములు రావని ప్రతీతి. తులసికి పరిసరాలను శుద్ధి చేసే శక్తి ఉంది. తులసి మొక్కలో ‘తెైమాల్‌’ ఔషధ పదార్థం ఉంటుంది. మన కంటికి కనిపించని అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను పరిసరాలకు రానివ్వకుండా తెైమాల్‌ అడ్డుపడుతుంది. తులసి మొక్కలున్న ప్రదేశంలో పిడుగులు పడవని ప్రతీతి. తులసి ఆకుల రసం సేవించటం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని రుజువెైంది. 500 మి.గ్రా. నీటిలో 5 గ్రాముల తులసి ఆకులను వేసి, మరిగించి కొద్దిగా పాలు, పంచదార కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. 
 
గొంతునొప్పి, గొంతు బొంగురుపోవటం లాంటి వాటిని తగ్గిస్తుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలను దరిచేరనియ్య‌దు. తులసి కషాయంలో తేనె, అల్లం రసం సమపాళ్లలో కలిపి సేవిస్తే ఇన్‌‌ఫ్లూయంజా, ఆస్తమా, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకుల రసంలో హారతి కర్పూరం కలిపి శరీరం పైన రాస్తే గజ్జి, తామర లాంటి దీర్ఘకాలపు చర్మపు వ్యాధులు సమసిపోతాయి. తులసి ఆకుల రసం ముక్కులోకి వేస్తే ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకుల రసం శ్వాస నాళాలలోని కఫాన్ని తొలగిస్తుంది. తేలు, జర్రి లాంటి విష కీటకాలు కుట్టిన చోట తులసి పసరు పూస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
 
తులసి, పచ్చ కర్పూరం, తమలపాకులు కలగలిపి నిత్యం సేవిస్తే ఉబ్బసం వ్యాధి కొన్నాళ్ళకు తగ్గిపోతుంది. పడిశం పట్టినపుడు వేడి నీళ్ళలో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే జలుబు తగ్గిపోతుంది. ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమిలి, ఆ రసం మింగితే కడుపులో పేరుకుపోయిన జబ్బులను దూరం చేస్తుంది. హిందూ దేవాలయాలలో తీర్థం తయారుచేసే సమయంలోనే తులసి ఆకులు వేస్తారు. 
 
తులసి ఆకులను ప్రత్యేకంగా సేవించకపోయినా, దేవుని తీర్థం సేవించినపుడెైనా కడుపులోని రుగ్మతలు రూపుమాప వచ్చనే సదుద్ధేశ్యంతో తీర్థంలో తులసి ఆకులు కలపాలనే ఆలోచన అనాదిగా, ఆనవాయితీగా వస్తుంది. తీర్థం పంచుతూ ఆలయ పూజారి ‘అకాల మృత్యు హరణ... సర్వ వ్యాధి నివారణం... సమస్త పాపక్షయకరం... భతవత్‌ పదోదకం.. శుభం’ అంటూ తులసి మనకు ఎన్ని విధాల ఉపయోగ పడుతుందో వివరిస్తాడు. తులసి చుట్టు ప్రదక్షణ చేస్తున్నప్పుడు ఉత్తేజకరమైన ‘పాజిటివ్‌ వైబ్రేషన్లు’ కలుగుతాయని పరిశోధనలు నిరూపించాయి. 
 
శ్వేత, కుష్ఠు మరియు బొల్లి లాంటివి పొడచూపి, శరీరం తెల్లగా మారి, వికృతంగా కనిపిస్తున్న వారికి ‘కృష్ణ తులసి’ ఎంతో మేలుచేస్తుంది. కృష్ణ తులసితో తయారుచేయబడిన మందులు ఊపిరితిత్తుల వ్యాధులను, గుండె జబ్బులను, ధనుర్వాతాలను, ప్లేగు, మలేరియాలను నిర్మూలించటానికి ఉపయోగిస్తు న్నారు. నేల తులసికి తలవెంట్రుకలకు బలాన్నిచ్చే శక్తి ఉంది. తల నూనెల తయారీకి నేల తులసిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కర్పూరం తయారీకి కూడా దీనిని వాడటం గమనార్హం. రామ తులసి ఆకులు అజీర్తిని పారద్రోలి, జీర్ణ శక్తిని పెంచుతాయి. భోజనం అనంతరం రామ తులసి లేత ఆకులను నమిలితే దంతాలు గట్టి పడటంతో పాటు, దంత సంబంధిత రుగ్మతలు అదుపవుతాయి.

వెబ్దునియా పై చదవండి