హాలీవుడ్ నటుడు జానీ డెప్ భార్యపై పరువు నష్టం కేసులో గెలిచాడు. జానీ గృహ హింస వేధింపులకు పాల్పడినట్లు హెర్డ్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ భార్య అంబర్ హెర్డ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వర్జీనియా కోర్టు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే ఆ కేసులో ఇద్దరికీ నష్టపరిహారం దక్కేలా జడ్జి తీర్పును వెలువరించారు.
డెప్‌కు 15 మిలియన్ల డాలర్లు చెల్లించాలని హెర్డ్‌కు కోర్టు ఆదేశించింది. ఇక హెర్డ్‌కు రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని కూడా కోర్టు జానీ డెప్‌ను ఆదేశించింది.
2018లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ భర్త డెప్‌పై హెర్డ్ గృహ హింస ఆరోపణలు చేసింది. తన పరువు తీసిందన్న ఉద్దేశంతో హెర్డ్‌పై 50 మిలియన్ల డాలర్ల పరువు నష్టం కేసును డెప్ దాఖలు చేశాడు.
అయితే దానికి కౌంటర్‌గా డెప్‌పై 100 మిలియన్ల డాలర్ల పరువు నష్టం కేసును హెర్డ్ వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ కేసులో విచారణ సాగింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం ఈ కేసులో బుధవారం తీర్పును వెలువరించింది.
పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ చిత్రంలో నటించిన జానీ డెప్, అంబర్ హెర్డ్‌లు 2011 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరూ 2105 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత 15 నెలల వ్యవధిలోనే నటి హెర్డ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. డెప్ తనను లైంగికంగా వేధించినట్లు హెర్డ్ ఆరోపించింది. దీంతో ఒకరిపై ఒకరు పరవునష్టం కేసుల్ని దాఖలు చేసుకున్నారు.