Article Hindu Religion %e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b1%81%e0%b0%a8 %e0%b0%89%e0%b0%b5%e0%b0%be%e0%b0%9a 107052400015_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున ఉవాచ

Advertiesment
అర్జున ఉవాచ

WD

హైదరాబాద్ (ఏజెన్సీ) , ఆదివారం, 3 జూన్ 2007 (18:09 IST)
కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన
ఇషుభిః ప్రతియోత్సా్యమి పూజార్హా వరిసూదన

అనువాదం: ఓ మధుసూదనా! నేను పూజించే భీష్మ, ద్రోణులను ఈ యుద్ధంలో బాణాలతో ఎదురొడ్డి ఎలా పోరాడగలను?

గురూ నహత్వా హి మహానుభావాన్‌
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే
హత్వా2ర్థకామాంస్తు గురూ నిహైవ
భుంజీయ భోగాన్‌ రుధిరప్రదిగ్ధాన్‌

అనువాదం: నాకు గురువులైన పెద్దలను చంపి సుఖాలను అనుభవించడం కంటే ఈ లోకంలో బిచ్చమెత్తుకుని జీవించడం మేలు. ఆ గురువులు ధనకాంక్ష గలవారైనా సరే. వారు ఎప్పుడూ పూజనీయులే. వారిని చంపి తద్వారా మనం అనుభవించేది అంతా రక్తమయమే కదా.

కార్పణ్య దోషోపహతస్వభావః పృచ్ఛామి
త్వాంధర్మసంమూఢచేతాః
యఛ్చ్రేయః స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే
హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌

అనువాదం: నేనిప్పుడు మనోవ్యాకులతతో బాధపడుతున్నాను. నా మానసిక దౌర్బల్యమే దీనికి కారణం. ఏది ఉత్తమమో, ఏది పాపమో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో వున్నాను. నాకేది ఉత్తమమో నీవే చెప్పు కృష్ణా! నేనిప్పుడు నీ శిష్యుడిని. నా ఆత్మ నీ శరణ వేడుకుంటోంది. నాకు సన్మార్గాన్ని ఉపదేశించు!

వ్యాఖ్యానం : తరతరాలుగా మనిషి నైజాన్ని యుగాల నాటి భగవద్గీతలో ఎంత అద్భుతంగా చిత్రీకరించారో ఇక్కడ అర్జునుడి తీరును ఉదహరించిన వైనం బట్టి తెలుస్తుంది. ఏ పని అయినా ఇష్టం లేకపోయినప్పుడు ... దానిని తప్పనిసరిగా చేయాల్సి వస్తే మనమే కాదు... మనిషి అన్నవాడు ఎవ్వడైనా ఎక్కడలేని సిద్ధాంతాలను బయటకు తీసి, నానావిధ కారణాలను చూపిస్తూ ఆ పని నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ఇక్కడ అర్జునుడు చేస్తున్న పని అదేలా కనిపిస్తుంది.

మొదట అర్జునుడు తాను యుద్ధం చేసి తన వారందరినీ చంపేస్తే లక్షల మంది ఆడవారు విధవలవుతారని, వారి ద్వారా వర్ణ సంక్రమం అయి కులధర్మం నశిస్తుందని బాధపడతాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ క్షత్రియుడు అయిన వాడు బంధుప్రీతి, వైరాగ్యాలను ప్రదర్శించకూడదని, తన కులధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని నచ్చచెబుతాడు... అయినా అర్జునుడు యుద్ధోన్ముఖుడు కాలేకపోతున్నాడు. కృష్ణుడి ఉపదేశం తర్వాత మళ్లీ తన సందేహాలను అర్జునుడు వెలిబుచ్చుతూ... తాను యుద్ధం చేయలేకపోవడానికి మరిన్ని కారణాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తాడు.

భీష్మ, ద్రోణులు తనకు పూజనీయులని, వారితో ఎలా యుద్ధం చేయగలనని ప్రశ్నించాడు. తర్వాత గురువులు ధనకాంక్ష వున్న వారైనా... పూజనీయులే అన్నాడు. అంటే వారిద్దరూ ధుర్యోధనుడి ఉప్పు తింటున్నందు వల్లనే అతడి పక్షం వహించారు తప్ప ధర్మం పక్షం కాదన్నది అర్జునుడి ఉద్దేశంగా ఇందులో కనిపిస్తుంది. అందుకే తన గురువులు ధనకాంక్ష గలవారైనా పూజనీయులే అనే మాటను ఉపయోగించాడు. వారితో యుద్ధం చేయడం కన్నా, రక్తమయమైన రాజ్యాన్ని ఏలుకోవడం కన్నా భిక్షం ఎత్తుకోవడం ఉత్తమమని అంటాడు.

ఆ తర్వాత వెంటనే తాను ఏది మంచో, ఏది చెడో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో వున్నానని అంటూ త్వమేవ శరణం అంటూ శ్రీకృష్ణుడిని సలహా ఇమ్మని కోరతాడు.

ఇక్కడ అర్జునుడి నుంచి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మూడు వున్నాయి. మొదటిది అతడు మహా పరాక్రమవంతుడు. రెండవది అతడు మహా జ్ఞాని. మూడవది అతడు మంచి వ్యక్తిత్వం గలవాడు.

అర్జునుడు పరాక్రమవంతుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక జ్ఞాని ఎందుకయ్యాడు అంటే... యుద్ధం అనే అత్యంత తీవ్రమైన, క్లిష్ట పరిస్థితిలో సైతం మంచి, చెడు ఆలోచించే గుణాన్ని అర్జునుడు కనబర్చాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అని గుడ్డిగా రంగంలోకి దూకేయడం లేదు అతడు. శౌర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో వైరాగ్యంగా ఆలోచిస్తున్నాడు. గురువులను చంపడం కన్నా భిక్షం ఎత్తుకోవడం మేలు అనడం ద్వారా అర్జునుడు అంతటి వాడు తనకు రాజ్యం గురించి, భోగాల గురించి ఎలాంటి కాంక్ష లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు.

ఎవ్వరైనా సరే. తను ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దాని పర్యావసానాలు ఎలా వుంటాయి? వాటిలో ఏది మంచి, ఏది చెడు? ఆలోచించాలి. ఏ పని చేసినా వివేకంతో , మంచి ఆలోచనతో చేయాలే తప్ప ఆవేశకావేషాలతో, ఆ క్షణాన్న పుట్టేసే మానసిక ఉద్రేకంతోనో చేయకూడదు. అర్జునుడు కూడా అలా చేసుంటే భగవద్గీత పుట్టేదే కాదు.

మనం మనకు మంచి అనుకుని చేసే పని తాలూకు ప్రభావం మరొకరికి ఇబ్బందిని గానీ, మరేదైనా నష్టాన్ని గానీ కలిగించే అవకాశం వుంటుంది. ఆ విషయం పట్టించుకోకుండా అనాలోచితంగా కొందరు తీసుకునే నిర్ణయాలు చాలామందిని బాధిస్తుంటాయి. ఎప్పుడూ స్వార్థమే కాకుండా సంఘంలో మనమూ ఒక భాగమని గుర్తిస్తూ, ఇతరుల శ్రేయస్సు కాంక్షిస్తూ, యుక్తాయుక్త విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం.

సాధారణంగా మనకు ఏదైనా దక్కనప్పుడు మాత్రమే ఏడుస్తాం. మనోవ్యాకులత, నిరుత్సాహం పొందుతాం. కానీ ఎంతమంది చచ్చినా... మనకు మహాసామ్రాజ్యం దక్కుతుందిలే అని అర్జునుడు సంతోషించలేదు. వాళ్లంతా పోతే ఇక ఈ రాజ్యం ఎందుకు అని మాత్రమే ఆలోచించాడు. అదే అర్జునుడి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. అదే నిస్సందేహంగా జ్ఞాని లక్షణం.

ఇక మూడవది, అతి ముఖ్యమైనది - అర్జునుడి ఓపెన్‌ మైండ్‌. క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టమో, నష్టమో ఏదైనా భరిద్దాం అనే ఆలోచన కాకుండా తను బాగా నమ్మే స్నేహితుడు, బంధువు, మార్గదర్శి, గురువు అయిన శ్రీకృష్ణుడిని తగిన సలహా ఇమ్మని కోరడం - ఒక వివేకవంతుడి లక్షణం. నాకన్నీ తెలుసు, నాకెవ్వరూ ఏమీ చెప్పనక్కర్లేదు అనే లక్షణాన్ని, అహంకారాన్ని, అవివేకాన్ని అర్జునుడు ఎక్కడా ప్రదర్శించడు భారతంలో. అందుకే మహానుభావుడైన శ్రీకృష్ణుడికి అతడు అత్యంత ప్రియశిష్యుడయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu