తిరుమలకు అప్పుడే విఐపిల తాకిడి ఆరంభమైంది. శనివారం పాలకమండలి కొలువుదీరుతున్న సందర్భంగా అధిక సంఖ్యలో బంధు మిత్రులను తీసుకురావడానికి పాలక మండలి సభ్యలు ప్రయత్నాలు చేశారు. ప్రమాణస్వీకారం పేరుతో గుంపులు గుంపులుగా దర్శనం కల్పించాలని కోరారు అయితే అందుకు టిటిడి ఈవో వీలు కాదని చెప్పడంతో సభ్యులు వెనక్కి తగ్గారు. వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల ప్రభుత్వం పాలకమండలిని నియమించింది. ఈ పాలకమండలికి అధ్యక్షుడుగా మాజీ మంత్రి చదలవాడ క్రిష్ణ మూర్తి నియమితులయ్యారు. ఆయనతోపాటు మరో 18 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వారిలో 13 మంది శనివారం ఉదయం 11.15 గంటలకు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రతిష్టాత్మక ఆలయ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో బీరకాయ పీచు బంధువులు కూడా సభ్యుల వెంట పడ్డారు.
దీంతో ఒకరిద్దరు సభ్యులు వందకుపై పాసులను కోరినట్లు సమాచారం. ఈ సంఖ్యను చూసి అధికారులు బెదిరిపోయారు. అసలే శనివారం ఆపై పగటి పూట క్యూలైన్ నిలిపేసి ప్రమాణస్వీకారం పేరుతో దర్శనం కల్పించడం సాధ్యం కాదని ఈవో దొండపాటి సాంబశివరావు తేల్చి చెప్పారు. దీని వలన సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని అంతమందికి అనుమతి కలిగించడం సాధ్యం కాదని చెప్పడంతో సభ్యులు తమ వెంట తెచ్చుకునే వారి సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చింది. దీంతో 25 మందికి లోపునే ఒక్కొక్క సభ్యుడు తమ బంధుగణాన్ని లోని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.