విద్యుత్పాక రంగంలోకి తిరుమల తిరుపతి దేవస్థానం అడుగుపెడుతోంది. 60 ఎకరాలలో భారీ ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విద్యుత్తు ఉత్పత్తిని చేసే బాధ్యతను ఓ కంపెనీకి అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఏం టీటీడీ విద్యుత్తు వ్యాపారం చేయబోతోందా..?
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక మార్గం నుంచి విద్యుత్తు ఉత్పాదక మార్గంలోకి అడుగు పెడుతోందా..! అంటే.. కాదు అయితే సొంతంగా విద్యుత్తు వినియోగం ఎక్కవ కావడంతో మాత్రమే ఉత్పాదక ప్రయత్నాలు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను భరిస్తోంది. ఎస్పీడీసీఎల్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఆదాయవనరుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో తామే ఒక విద్యుత్తు ఉత్పాదక కేంద్రాన్ని నెలకొల్పితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సోలార్ పవర్ ప్రాజెక్టు వైపు అధికారులు అడుగులు వేశారు.
ఇందుకోసం అవసరమైన స్థలాన్ని గుర్తించారు. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఒక దాత ఇచ్చిన 60 ఎకరాల స్థలంలో పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పవర్ ప్రాజెక్టును నిర్మించే బాధ్యతను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి భూమి అప్పజెప్పి మౌళిక సదుపాయాలను టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పెట్టుబడి పెట్టి ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పదేళ్ళవరకూ ఆ సంస్థే ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయిస్తుంది. ఆపై ఉత్పాదక కేంద్రాన్ని పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పజెప్పాల్సి ఉంటుంది.
అయితే ఈ విద్యుత్ ఉత్పాదక కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే కరెంటును అక్కడికి సమీపంలో సబ్ స్టేషన్‌కు సరఫరా చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఎస్పీడీసీఎల్ ఆ మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే తిరుపతి, తిరుమల ప్రాంతంలో అవసరమైన విద్యుత్తును ఎస్పీడీసీఎల్ ఇక్కడి సబ్ స్టేషన్ల నుంచి టీటీడీకి అందజేస్తుంది. అక్కడి ఉత్పత్తి, ఇక్కడి విద్యుత్తు వాడాకాన్ని మదింపు వేసి వచ్చే వ్యత్యాసాన్ని సంస్థలు భరించాల్సి ఉంటుంది. వాడకం కంటే ఎక్కువ ఉత్పత్తి అయితే ఎస్పీడీసీఎల్ అంత మొత్తాన్ని టీటీడీకి అప్పజెప్పుతుంది. వాడకం ఎక్కువగా ఉంటే వ్యత్యాసం వచ్చే మొత్తాన్ని టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే తిరుమలలో దాతలు ఏర్పాటు చేసిన పవన విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. అదే తరహాలో సోలార్ ప్రాజెక్టును కూడా నిర్మించబోతున్నారు.