Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవి తప్పకుండా అధోగతికి లాగుతాయి... స్వామి వివేకానంద

సమస్త జ్ఞానసారం ఏకాగ్రత. ఇది లేకుంటే ఏ పని సాధ్యం కాదు. మామూలు మనిషి ఆలోచనశక్తి, నూటికి తొంభై వంతులు నష్టమైపోతూ ఉంటుంది. అందుకే అతను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. సుశిక్షిత మానవుడు ప్రమాదాలకు తావివ్వడు. సుశిక్షిత మనస్సు తప్పు చేయదు.

అవి తప్పకుండా అధోగతికి లాగుతాయి... స్వామి వివేకానంద
, బుధవారం, 19 జులై 2017 (21:07 IST)
సమస్త జ్ఞానసారం ఏకాగ్రత. ఇది లేకుంటే ఏ పని సాధ్యం కాదు. మామూలు మనిషి ఆలోచనశక్తి, నూటికి తొంభై వంతులు నష్టమైపోతూ ఉంటుంది. అందుకే అతను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. సుశిక్షిత మానవుడు ప్రమాదాలకు తావివ్వడు. సుశిక్షిత మనస్సు తప్పు చేయదు. 
 
మనస్సు ఏకాగ్రమై, అంతర్ముఖమైనప్పుడు మనలోని శక్తులన్నీ మనకు సేవకులౌతాయే తప్ప, మనకు జమానులు కావు. గ్రీకులు తమ ధారణాశక్తిని బాహ్య ప్రపంచం మీదకి ప్రయోగించారు. అందుకే వారిలో లలిత కళలు-సారస్వతం మొదలైనవి పరిపూర్ణత్వాన్ని పొందాయి. హిందువు అంతరజగత్తు మీద చిత్తాన్ని ఏకాగ్రత చేశాడు.
 
అగోచర ఆత్మసీమల మీద దృష్టిని కేంద్రీకరించి, యోగ విజ్ఞానాన్ని అభివృద్ధి చేశాడు. మనస్సును - ఇంద్రియాలను - ఇచ్ఛను నిగ్రహించడమే యోగం. దీన్ని నేర్చుకుంటే ఇంద్రియాలకు మన వశం కావటానికి బదులుగా ఇంద్రియాలనే మనం స్వవశం చేసుకుంటాం. ఇదే మనకు కలిగే ప్రయోజనం.
 
పొరల దొంతరల మాదిరిగా ఉంటుంది మనస్సు. ఈ పొరల అన్నింటినీ దాటి, భగవంతుణ్ణి పొందటమే మన నిజ లక్ష్యం. యోగంలో పరమావధి భగవత్ సాక్షాత్కారమే. దీనికోసం మనం సాపేక్షజ్ఞానాన్ని - ఇంద్రియ ప్రపంచాన్ని దాటాల్సి ఉంటుంది. మన ఆ ప్రపంచం గోచరం. దీని మీద ఈశ్వరపుత్రులు దీనికతీతంగా వెలుగుతుంటారు. లౌకికులు ఆత్మజ్ఞాన విహీనులై ఉంటే, ఆ లోకంలో ఈశ్వరపుత్రులు మేలుకొని ఉంటారు.
 
క్రమంగా అవి తక్కువ పరిమితికి మనస్సును నిగ్రహించటమే ఏకగ్రత. ఈ మనస్సంయమనానికి అష్టాంగాలున్నాయి. మొదటిది యమం. బాహ్య సాధనాలను వదలిపెట్టటం ద్వారా మనస్సును స్వాదీనం చేసుకోవటం ఇది. నీతినియమాలన్నీ దీన్లోనే చేరతాయి. దుష్కార్యాలు చేయకు, ఏ ప్రాణినీ హింసించకు, పన్నెండేండ్లు నువ్వు ఏ జీవికి ఎలాంటి హింస చేయకుండా ఉంటే, సింహాలు - పులులు కూడా నీకు లోబడిపోతాయి. పన్నెండేండ్లు మనోవాక్కర్మల్లో నూటికి నూరువంతులు సత్యాన్ని పాటించేవారు సంకల్పసిద్దులౌతారు.
 
వాక్కు - మనస్సు - క్రియల్లో పరిశుద్దతను అలవరచుకోవాలి. మతానికి పరిశుద్దతే మూలస్తంభం. దేహపరిశుద్దత ముఖ్యంగా విధాయకం. రెండవది నియమం మనస్సును ఏదిక్కుకూ వెళ్లనివ్వక - యధేచ్చగా సంచరింపనీయక నిగ్రహించటమే నమయలక్ష్యం
 
దేహం - మనస్సు ఎంత శుచిగా ఉంటే, ఫలితం అంత శీఘ్రంగా కలుగుతుంది. నీవు నిష్టగా శుచిని అలవరచుకోవాలి చెడు విషయాలు గురించి యోచించవద్దు. అవి తప్పకుండా నిన్ను అధోగతికి లాగుతాయి. నువ్వు పూర్తిగా పరిశుద్దతను అలవరచుకుని, విశ్వాసంతో సాధన చాలా అవసరం. అతీంద్రియానుభవం పొందిన తర్వాత దేహ భావం తొలిగిపోతుంది. అప్పుడే జీవుడు ముక్తుడు - అమృతుడు అవుతాడు.
 
బాహ్యదృష్టికి అచేతనస్థితి - అతీంద్రయానుభూతి ఒక్కలాగే తోస్తాయి. అయితే మట్టిముద్దకు - బంగారుముద్దకు ఉన్న వ్యత్యాసం ఆరెండిటికి ఉంది. తన ఆత్మను పూర్తిగా ఈశ్వరుడికి అర్పించుకున్నవాడే, అతీంద్రియ స్థాయిని అందుకున్నవాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనీశ్వరునికి నువ్వులు, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే.?