పాఠశాల విద్యార్థుల కోసం ప్రతీ యేడు ఏర్పాటు చేసే శుభప్రదం కార్యక్రమాన్ని మే 11 నుంచి పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. బుధవారం తిరుపతిలో ఆయన శుభప్రదానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. వారి కోసం మే 11 నుంచి 20 వరకూ వేసవి సెలవులలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపైన రెండు రాష్ట్రాలలో తగిన ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
ధార్మిక కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వారిలో ఏడు మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి రఘునాథ తదితరులు పాల్గొన్నారు.