Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘శ్రీపంచమి’ మహాసుప్రసిద్ధమైన పర్వదినం, ఈ రోజు ఏం చేయాలో తెలుసా?

‘శ్రీపంచమి’ మహాసుప్రసిద్ధమైన పర్వదినం, ఈ రోజు ఏం చేయాలో తెలుసా?
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (08:42 IST)
మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ లేదా 'వసంత పంచమి' అంటారు. వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది .

ఈ దినం మహాసుప్రసిద్ధమైన పర్వదినం. దేవీభాగతం, బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలో ఈ శ్రీ పంచమిని గురించి విశేషంగా చెప్తున్నాయ. సకలవిద్యా స్వరూపిణి అయిన పరాశక్తి ‘సరస్వతీ దేవి’గా జన్మదినంగా చెప్తారు. శ్రీపంచమి విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంచెప్తుంది.

విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత ఈవిద్యాదానానికే ప్రాముఖ్యత ఉందని అంటారు. సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి వుంటుంది. ఈ మూర్తి విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఈ జ్ఞాన ప్రదాయిని కరుణ తోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం.

విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానము, జ్ఞానము చేత ధనం, ధనం చేత అధికారము సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడనిది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. సమాజంలో విద్య కలిగినవాడు ధనవంతుని కన్నా, సంఘంలో గొప్పవాడని, ఎక్కడివెళ్లినా బతకకలుగుతాడని శతకకారులు చెప్పడంకాదు నిత్యమూ ఎదురయ్యే విషయమే.

సరస్వతీ ఆరాధన వల్ల వాక్సుద్ధి వస్తుంది. మనిషికి మాటేప్రాణం కనుక ఈ దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అనీ పిలుస్తారు. సరస్వతీ దేవిని పూర్వం అశ్వలాయనుడు ఆరాధించి ఆ తల్లి కటాక్షం పొందాడని అంటారు. సరస్వతీ దేవి ఆరాధించే విధానం ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంథం తెలియపరుస్తోంది.

అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.

శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమి నాడు పూజించడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం.

‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలు గల ఈ వాగ్దేవి ‘సామాంపాతు సరస్వతి’ అనే మకుటంతో ఉన్న శ్లోకాలతో పఠించడం వల్ల శారదాదేవి సంతోషించి అపార జ్ఞాన రాశిని ప్రసాదిస్తుందని పెద్దలుచెప్తారు.

అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీ ని ఆరాధిస్తూ ఇక్కడే వేద వ్యాసుడు తపం ఆచరించాడట. అమ్మవారి సాక్షాత్కారం పొంది అమ్మ అనుగ్రహంతోనే వేద విభజన, మహాభారతాది పురాణాలను రచించాడని అంటారు. ఈ అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలకు అమ్మకరుణ తో జ్ఞాన రాశులు అవుతారని పెద్దల నమ్మకం.

ఈ రోజున సరస్వతీ దేవిని తెల్లని పూలతో పూజించాలి. అమ్మవారిని శే్వత వ స్త్రాలతో కాని, పసుపు పచ్చ వస్త్రాలతో కాని అలంకరించాలి. అమ్మ వారికి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నాన్ని , నేతి పిండివంటలను, చెరకును, అరటి పండ్లను, నారికేళాన్ని నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని అంటారు.

కుల మత భేదాలు లేకుండా ప్రపంచంమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నప్పటికీ మాఘ మాసంలో వచ్చే ఈ పంచమి తిథి ప్రత్యేకత సంతరించుకొంది. ఈ రోజున బాసర క్షేత్రాల వంటి సరస్వతీ ఆలయాల్లో విశేష పూజలు అర్చనలు జరుపుతారు. పుష్య, మాఘ ద్వయంతో కూడిన ఆదివారం రోజున శ్రీపంచమి వస్తే, ఆరోజున సూర్యారాధన వల్ల కోటి గ్రహణ స్నానపుణ్య ఫలం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 16న వసంత పంచమి: సరస్వతి దేవికి నేతితో పిండివంటలు..?