పన్నెండు వసంతాలకోసారి వచ్చే పుష్కర పుణ్యాన్ని దక్కించుకొనేందుకు దేశం నలుమూలల నుంచి గోదారి తీరానికి భక్త జనం పోటెత్తుతున్నారు. మంగళవారం ఉదయం సరిగ్గా 6.26గంటలకు గురుడు సింహరాశిలోకి ప్రవేశించే ముహూర్తాన పుష్కరాలకు నాంది పలికారు. రాజమండ్రిలోని సరస్వతీఘాట్‌లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పుష్కర స్నానమాచరించి అధికారికంగా ప్రారంభించారు. తొలుత కంచిపీఠాధిపతులు పుణ్యస్నానమాచరించారు. తితిదే తరుపున గోదావరి మాతకు ఏపీ సీఎం చంద్రబాబు చీర, సారె సమర్పించారు. తితిదే ఈవో, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 9గంటల వరకు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. రద్దీనిబట్టి ఆ తర్వాత కూడా అనుమతిస్తారు. సోమవారం సాయంత్రానికే సుమారు లక్ష మంది పుష్కర స్నానమాచరించారు. పుష్కర ప్రాంతాల్లో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. గోదావరి నీటిమట్టం తగ్గడంతో సీలేరు నుంచి 6వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మరో వైపు పుష్కరాలకు రూ.1600 కోట్లతో ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో 162 పుష్కరఘాట్లు భక్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. రోజుకి 25 లక్షల మంది చొప్పున మొత్తం 3 కోట్ల మంది పుష్కరస్నానమాచరిస్తారని అంచనా వేస్తున్నారు. దాదాపు 70వేల మంది వివిధ శాఖల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఉదయం 8 గంటలకు పుష్కర స్నానం చేస్తారు.
తెలంగాణలో తొలి పుష్కరం
తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి పొడవునా పలు క్షేత్రాల్లో ఏర్పాటైన 106 పుష్కర ఘాట్లు భక్తులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. మంగళవారం ఉదయం 6.21 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం ఆచరించి వేడుకలను ఆరంభిస్తారు. ఆయన సోమవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా ధర్మపురి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు... పుష్పగిరి, మంత్రాలయం, శ్రీశైలం, శ్రీమఠం, హంపి, తొగుట, శారదా పీఠాధిపతులు కూడా ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. కేసీఆర్ సతీసమేతంగా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయం వద్దకు చేరుకుని స్వామి వారి నిత్య పూజల తర్వాత... పుష్కర ప్రారంభానికి స్వామివారి ఆజ్ఞ తీసుకుకుంటారు.