చంద్రగ్రహణం రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నఅన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపాక భక్తులకు దర్శనం కల్పిస్తారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా రోజంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదిన వైశాఖ పౌర్ణమి రోజున (శనివారం) మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహం ప్రభావం కన్య, తుల, కుంభ, మిథున రాశులపై ఉంటుందని వేదపండితులు పేర్కొంటున్నారు.
కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణి మహిళలు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలను మూసివేయనున్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలపై కొలువున్న వెంకటేశ్వర స్వామి సన్నిధిని ఉదయం 9.30 గంటలకు మూసివేశారు. రాత్రి 8.30 గంటలకు తెరుస్తారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం శనివారమంతా తెరిచే ఉంటుంది. రాహు కేతు క్షేత్రం కాబట్టి ఈ ఆలయానికి గ్రహణం ప్రభావముండదని అర్చకులు తెలిపారు.