చెన్నైలో యోగా పాఠాలు చెప్పిన సద్గురు జగ్గీ వాసుదేవ్
చెన్నైలోని పచయప్పా కాలేజీ గ్రౌండ్‌లో ప్రముఖ యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ నెల 25 నుంచి 27 వరకూ యోగా పాఠాలు చెప్పారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 14 వేల 154మంది పాల్గొన్నారు. యోగాలోని ప్రాచీనమైన "శాంభవి మహాముద్ర" గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి చెన్నై నగరం నుంచే కాక ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పాల్గొన్నవారిలో 15 ఏళ్ల బాలబాలికల దగ్గర్నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని తమిళనాడులోని తిరుచ్చి, మధురైలలో కూడా నిర్వహించనున్నట్లు ఇషా ఫౌండేషన్ తెలిపింది. ఈ కార్యక్రమానికి సుమారు 10 వేలమంది వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రాచీన యోగా పద్ధతులను పాటిస్తే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుపడానికి ఇషా ఫౌండేషన్ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా యోగా గురువు శాంభవి మహాముద్ర, క్రియ వంటి యోగా పద్ధతులు వివరిస్తున్నారు. వీటిని నేర్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి వెళ్లొచ్చు. ఏకాగ్రతను సాధించవచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య ఫలితాలున్నాయి.