కాల్సెంటర్లలో పని చేసే చాలా మంది యువత తరచుగా చెవి నొప్పిగా ఉందంటూ ఆసుపత్రికి వెళుతుంటారు. పొద్దస్తమానం పని చేయడం వల్లే ఈ తరహా నొప్పి వస్తుందా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే...
నిజానికి కాల్సెంటర్లో పని చేసే ముందు యువతి యువకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తరహా ఉద్యోగంలో చేరే ముందు వినికిడి పరీక్ష చేయించుకుంటే మంచిది. దీనివల్ల వినికిడి సాధారణంగా ఉందా? ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా? అనేది ఇట్టే తెలిసిపోతుంది.
అలాగే, ఎన్ని గంటలు పని చేయాలి? ఎంత సమయం విశ్రాంతి తీసుకోవాలి? అనేది ముందుగా తెలుసుకోవాలి. కాల్సెంటర్లో మధ్య మధ్యలో విరామం ఉంటుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటానికే ప్రయత్నించాలి. ఎలాంటి శబ్దమూ రాని రూములో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి.
అలాకాకుండా ఈ గ్యాప్లో మళ్లీ సెల్ఫోన్ మాట్లాడటం, ఇయర్ఫోన్లు పెట్టుకుని మ్యూజిక్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. సుదీర్ఘ సమయం పాటు సంగీతం వినడం, మాట్లాడటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల చెవుల్లో వినికిడి లోపం ఏర్పడుతుంది.
ముఖ్యంగా కాల్సెంటర్లో పనిచేసేవాళ్లు ఎంత వీలైతే అంత సమయం చెవికి విశ్రాంతి ఇవ్వాలి. చెవిలో ఏమాత్రం నొప్పి ఉన్నట్టు అనిపించినా తక్షణం స్పెషలిస్టును కలిసి ప్రాథమిక చికిత్స చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.