పాలతో మతిమరుపు దూరం... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...
రోజుకు మూడు గ్లాసుల పాలతో మతిమరుపును పారదోలగలం. ఎక్కువ మొత్తంలో ఎవరైతే పాలను తాగుతారో, వారి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరిగి మెదడు కణాలకు రక్షణ కల్పించడంలో తోడ్పడుతుంది. పాలలో ఉండే గ్లుటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా
రోజుకు మూడు గ్లాసుల పాలతో మతిమరుపును పారదోలగలం. ఎక్కువ మొత్తంలో ఎవరైతే పాలను తాగుతారో, వారి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరిగి మెదడు కణాలకు రక్షణ కల్పించడంలో తోడ్పడుతుంది. పాలలో ఉండే గ్లుటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయని, రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల అల్జీమర్స్, పార్కిన్‌సన్ వంటి వ్యాధులు దరి చేరవని చెబుతున్నారు.
పాలలో ఉండే గ్లుటాథయోన్ మనిషి మెదడుపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అమెరికాకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రయోగం కోసం వృద్ధులను, మధ్యవయస్కులను ఎంచుకున్నారు. ఈ యాంటీ ఆక్సిడెంటు మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ బారినుంచి రక్షిస్తాయి. జీవక్రియల్లో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల బారినుంచి కూడా రక్షిస్తాయి. ఈ విధమైన ఆక్సీకరణ చర్యల ద్వారా కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్లు సహాయం చేస్తాయి. కన్సాస్ యూనివర్శిటీ వైద్య విభాగానికి చెందిన న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యంగ్ చోయ్, న్యూట్రిషన్ విభాగాధిపతి దేబ్రా సల్లివాన్ ఈ పరిశోధనను నిర్వహించారు.
కండరాలకు, ఎముకలకు పాలు బలాన్ని చేకూరుస్తాయని, ఇతరత్రా కారణాల వల్ల కూడా పాలు తాగడం మంచిదని సల్లివాన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన ద్వారా పాలు మెదడుకు అత్యంత అవసరమని తెలిసిందని అన్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం ద్వారా, రోజువారీ వ్యాయామం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ’క్లినికల్ న్యూట్రిషన్’ అనే అమెరికన్ జర్నల్ నివేదిక ప్రకారం అప్పుడే పాలు తాగటం ప్రారంభించినవారి మెదడులో గ్లుటాథయోన్ ఉన్నట్లు కనుగొన్నారు. రోజుకి మూడు గ్లాసుల పాలు తాగేవారిలో ఆ లెవల్స్ ఇంకాస్త ఎక్కువగా కనిపించాయి. ఆక్సీకరణ చర్యావేగం వ్యాధులతోను. అనారోగ్య పరిస్థితులతోను సంబంధం కలిగి ఉంటుంది. క్యాన్సర్‌కు, అల్జీమర్స్‌కు, పార్కిన్‌సన్‌కు కారణం కూడా ఈ ఆక్సీకరణ చర్యావేగమేనని పరిశోధకులు చెబుతున్నారు.
రోగనిరోధకశక్తిలో భాగంగా యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలిగించే పదార్థాలపై దాడి చేస్తాయని, మానవ మెదడులో వివిధ స్థాయిలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆహార అలవాట్లలో వచ్చిన మార్పు కారణంగా వచ్చే అసమతౌల్యాన్ని సరిచేస్తాయని డాక్టర్ చోయ్ అన్నారు. ఆధునిక మాగ్నటిక్ రెజొనెన్స్ టెక్నాలజీని వాడడం వల్ల మెదడులో జరిగే చర్యలను తేలికగా తెలుసుకోడానికి ఆస్కారం ఏర్పడిందని ఆయన అన్నారు. ఇంకా దీనిపై పరిశోధన చేయవలసిన అవసరముందని తెలిపారు.
అయితే, ఇతర పరిశోధనలతో పోల్చినప్పుడు పాల వల్ల కలిగే ఉపయోగాలపై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నరాలు బలహీనపడటాన్ని తగ్గించడంలో పాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వారు పరిశోధనలో తేల్చారు. అయితే పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంటు కాకుండా బి 12 విటమిన్ వ్యాధి నివారణలో తోడ్పడుతుందని తెలియజేశారు.