'పేదవాడి ఆపిల్'గా పేరుగాంచిన అరటిపండుతో జీర్ణసంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో 75 శాతం మేరకు నీరు, గుజ్జు రూపంలో ఉంటుందని, పండే కొద్దీ గుజ్జు మరింత మెత్తగా మారుతుంది. ఇందులో కార్బోహైడ్రెట్స్ మన శరీరానికి శక్తినిస్తాయి.
పీచు పదార్థం, మెగ్నీషియమ్ పుష్కలంగా వున్నందున మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు. పెద్దపేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం.
డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి రెండు, మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడిన వాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
అంతేకాకుండా, అరటిపండు మంచి పోషక విలువలను కలిగివుంటుంది. యేడాది పొడవునా పుష్కలంగా లభిస్తుంది. ఇది త్వరగా జీర్ణమైపోయి శక్తిని ఇస్తుంది. సంపూర్ణాహారమైనందున ఎదుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది. చాలామంది భోజనం చేశాక అరటి పండును విధిగా తింటారు.