మీ పిడికిలి పట్టు గట్టిగానే ఉంటోందా..? అయితే, మరేం ఫర్వాలేదు. ఎలాంటి గుండెజబ్బులు లేకుండా మీరు భేషుగ్గా బతికేస్తారు. పిడికిలి పట్టుకు, గుండె ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉన్నట్లు కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేలింది. పదిహేడు దేశాలకు చెందిన 1.40 లక్షల మందిపై పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల్లో పాల్గొన్న వారిలో 35 నుంచి 70 ఏళ్ల వరకు వివిధ వయస్సుల వారు ఉన్నారు. పిడికిలి పట్టు బలాన్ని పరీక్షించేందుకు హ్యాండ్‌గ్రిప్ డైనమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. పిడికిలి పట్టు గట్టిగా కాకుండా, సడలినట్లు ఉంటే భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.