Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 నెల‌ల బాలుడికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స...

14 నెల‌ల బాలుడికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స...
, గురువారం, 28 జనవరి 2021 (22:00 IST)
విజయవాడ‌: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న అను న్యూరో అండ్ కార్డియాక్ ఇనిస్టిట్యూట్‌లో 14 నెల‌ల ప‌సికందుకు చిన్నమెదడులో ఏర్ప‌డ్డ క‌ణితిని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ తీగల రమేష్ నేతృత్వంలోని వైద్య బృందం శ‌స్త్ర‌చికిత్స చేసి తొలగించి, ఆ ప‌సికందు ప్రాణాల‌ను కాపాడారు. ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ అను ఇనిస్టిట్యూట్ నందు గురువారం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటుచేశారు. 
 
సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా బాలుడి చిన్నమెదడులో ఏర్పడిన కణితిని తొలగించి, చిన్నారిని మృత్యుంజయుడిగా చేసిన డాక్టర్ తీగల రమేష్ మాట్లాడుతూ.. 14 నెల‌ల ప‌సివాడిని అతడి తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో అను ఇనిస్టిట్యూట్‌కు తీసుకొ‌చ్చార‌ని తెలిపారు. బాలుడి చిన్నమెదడులో నిమ్మకాయంత పరిమాణంలో కణితి ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అంతకు ముందు బాలుడిని అతడి తల్లిదండ్రులు పలువురు వైద్యులకు చూపించినప్పటికీ, సమస్య తీవ్రత దృష్ట్యా ఆయా ఆసుపత్రుల్లో బాలుడికి చికిత్స లభించలేదని చెప్పారు.
 
అత్యంత ప్రమాదకర స్థితిలో తమ ఆసుపత్రిలో చేరిన చిన్నారికి అత్యాధునిక న్యూరో సర్జరీ పరికరాలతో నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి, చిన్నమెదడులోని కణితిని తొలగించామని వివరించారు. చిన్నమెదడులో ఇంత పెద్ద పరిమాణంలో కణితి ఉన్న 14 నెలల పసిబాలుడికి విజయవంతంగా సర్జరీ చేయడం అత్యంత అరుదైన విషయమని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా అత్యాధునిక విధానంలో క్రేనియాటమీ సర్జరీ చేసి కణితిని సమూలంగా తొలగించడం సాధ్య‌మైంద‌న్నారు.
 
బాలుడి చిన్నమెదడులో ఏర్పడిన కణితి క్యాన్సర్ ట్యూమర్ అయివుండొచ్చని అన్నారు. ఇటువంటి అరుదైన సమస్యలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం వల్ల సరైన సమయంలో రోగులకు చికిత్స అందటం లేదని, సరైన సమయంలో కచ్చితమైన చికిత్స అందించడం ద్వారా సత్ఫాలితాలను సాధించవచ్చని డాక్టర్ తీగల రమేష్ తెలిపారు. అను ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమేష్ మాట్లాడుతూ అత్యంత అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌ను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ తీగల రమేష్ బృందాన్ని అభినందించారు.
 
డాక్టర్ తీగల రమేష్ తో పాటు జూనియర్ న్యూరో సర్జన్ సాయికృష్ణ, అనస్థిషియన్లు పల్లవి, విశ్వేశ్వరరావు, పీడియాట్రిక్ సర్జన్ రవికుమార్‌లు ఈ అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌లో పాల్గొని అత్యంత నైపుణ్యంతో వ్య‌వ‌హ‌రించి చిన్నారికి పునర్జీవితం ప్రసాదించారని అన్నారు. అను ఇనిస్టిట్యూట్ నందు అనుభవజ్ఞులైన న్యూరాలజిస్టులు, నిష్ణాతులైన న్యూరో సర్జన్లు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జి.రమేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ అనస్థిషియాలజిస్ట్ కె.పల్లవి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ సీఎస్ఆర్ సాయికృష్ణ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిరపకాయలు మూత్రంలో మంటను తగ్గిస్తాయి.. ఎలాగంటే?