మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా హప్లోఐడెంటికల్ బోన్‌మారో మార్పిడి శస్త్రచికిత్సను 20 సంవత్సరాల వయసు కలిగిన బీకామ్ విద్యార్థి కోయ ఈశ్వర్ సాయి గణేష్‌కు నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు కుటుంబ దాత నుంచి పూర్తిగా సరిపోలిన హెచ్‌ఎల్‌ఏకు బదులుగా సగం సరిపోలిన హ్యూమన్ ల్యుకోసైట్ యాంటీజెన్ (హెచ్‌ఎల్‌ఏ)ను తల్లిదండ్రులు లేదంటే తోడబుట్టిన వారి నుంచి సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా మణిపాల్ హాస్పిటల్ నిలిచింది.
ఈ మార్పిడి శస్త్రచికిత్స గురించి క్యాన్సర్ వైద్య మరియు మూలకణ మార్పిడి నిపుణులు డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ ఈ రోగికి 2016లో టీ-లింపోబ్లాస్టిక్ లింఫోమాను గుర్తించడం జరిగింది. దీనికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అతను చికిత్స తీసుకున్నాడు. ఈ రోగికి 2019లో అంటే చికిత్స ముగిసిన ఆరు నెలల కాలంలోనే మరలా వ్యాధి బయటపడింది. ఈ రోగిని ఆస్పత్రిలో 20 జనవరి 2021లో చేర్చారు. అక్కడ ఆయనకు వ్యాధిని నియంత్రించడం కోసం కీమోథెరఫీ చికిత్సను అందించారు. దీనికి అతని జబ్బు బాగా తగ్గింది. ఒకసారి వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత మేము హప్లోఐడెంటికల్ (సగం-సరిపోలిన) మూలకణ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. తద్వారా ఈ రోగిలో మరలా ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఉండవు. ఈ చికిత్స కోసం ఈ రోగి తన తండ్రి శ్రీ కోయ శ్రీనివాసరావు నుంచి స్టెమ్ సెల్‌ను పొందారు అని అన్నారు.
మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, ఈ రోగి మా ఆస్పత్రిలో చేరి 100 రోజులు దాటింది. అప్పటి నుంచి అతను మా నిరంతర సంరక్షణ, పరిశీలనలో ఉన్నాడు. అందుబాటులోని సమాచారం ప్రకారం ఈ తరహా నిర్థిష్టమైన చికిత్సలో మరణాలు గరిష్టంగా 48% వరకూ జరుగవచ్చు. మరీ ముఖ్యంగా మొదటి నెలలోనే 25% వరకూ మరణాలూ సంభవించవచ్చు. విజయవంతంగా ఈ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించడంతో పాటుగా రోగి సురక్షితంగా కోలుకునేందుకు భరోసా కల్పించిన కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీ. కృష్ణారెడ్డి మరియు ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ మాధవ్ దంతాల తో పాటుగా డాక్టర్ల బృందం, వారి సిబ్బందిని అభినందిస్తున్నాము. మన దగ్గర అన్నిరకాల (అల్లోజెనిక్, ఆటోలోగస్, హప్లో) మూలకణ మార్పిడులు చేయడం ఎంతో గర్వకారణం అని తెలియజేసారు.
సాయి గణేష్ లాంటి ఎంతోమంది రోగులకు సీఎం సహాయనిధి ద్వారా మద్దతునందించిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. వీరి తోడ్పాటు కారణంగానే ఈ విపత్కర సమయంలో ఆర్ధిక పరంగా రోగి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుంది. ఈ కష్టకాలంలో మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ రోగులతో పాటుగా చికిత్సనందించడం ఆస్పత్రికి ఖచ్చితంగా పెద్ద సవాల్. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా, అన్ని రకాల రోగుల సమస్యలకూ చికిత్సనందించడంతో పాటుగా కోవిడ్ రోగులకు చికిత్సనందించడమూ మా బాధ్యత. కోవిడ్ భద్రత మార్గదర్శకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలయ్యేలా భరోసా కల్పించిన డాక్టర్లు మరియు సిబ్బందికి మేము ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. కోవిడ్ మరియు కోవిడేతర రోగుల చికిత్స కోసం సురక్షితమైన వాతావరణం వారు సృష్టించారు అని అన్నారు.
శ్రీ కోయ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా అబ్బాయికి చికిత్సనందించిన ఆస్పత్రికి నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. మా అబ్బాయిని వారు ఆరోగ్యవంతంగా మాకు అప్పగించారు. తొలుత తాము చికిత్సకోసం హైదరాబాద్ వెళ్లాలనుకున్నాం. అయితే మణిపాల్ ఆస్పత్రి, విజయవాడలో అదే తరహా చికిత్స అందిస్తున్నారని తెలుసుకున్న తరువాత ఆ చికిత్సకోసం హైదరాబాద్ వరకూ వెళ్లడం అనవసరం అనిపించింది. మా అబ్బాయికి స్థిరంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా అన్ని సమస్యలకూ తగిన పరిష్కారం అందించగలమనే భరోసా అందించారు. రోజువారీ కూలీగా తమలాంటి వారు ఇలాంటి అరుదైన చికిత్స ఖర్చు భరించడం అసాధ్యం అయితే, ముఖ్యమంత్రి సహాయనిధి మద్దతుతో ఈ చికిత్సను పూర్తి ఉచితంగా పొందగలిగాం. మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ స్టెమ్ సెల్ మార్పిడి శస్త్రచికిత్స మొత్తం ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించింది అని అన్నారు.
ఈ రోగిని ఏప్రిల్ 2021 మొదటి వారంలో డిశ్చార్జ్ చేశారు. స్టాండర్డ్ ప్రోటోకాల్ కింద ఈ రోగిని కనీసం తరువాత సంవత్సరం వరకూ కూడా డాక్టర్లు స్థిరంగా పర్యవేక్షించనున్నారు.