Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తలకు మసాజ్ చేయించుకోండి.. కానీ మెడ భాగానికి వద్దు...

చాలామంది బార్బర్ షాపులో వెంట్రుకలు కత్తిరించుకున్న తర్వాత తల, మెడ భాగానికి మసాజ్ చేయించుకుంటారు. అలా చేయించుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తలకు మసాజ్ చేయించుకోండి.. కానీ మెడ భాగానికి వద్దు...
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (14:26 IST)
చాలామంది బార్బర్ షాపులో వెంట్రుకలు కత్తిరించుకున్న తర్వాత తల, మెడ భాగానికి మసాజ్ చేయించుకుంటారు. అలా చేయించుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసు ఒకటి ఢిల్లీలో వెలుగు చూసినట్టు వారు ఉదహరిస్తున్నారు. 
 
ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ (54) నెల రోజుల క్రితం హెయిర్ కటింగ్, ఆ తర్వాత తల, మెడ భాగాలకు మసాజ్ చేయించాడు. ఆ సమయంలో మెడలను గట్టిగా అటుఇటు తిప్పడాడు. మసాజ్ చేసే సమయంలో హాయిగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజులకు ఆయన శ్వాస తీసుకోవడం సమస్యగా మారింది. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా, శ్వాస వ్యవస్థ దెబ్బతినిందని వైద్యులు గుర్తించి, అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందించసాగారు. 
 
ఈ క్రమంలో అసలు కారణం కనుగొనేందుకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో శరీరమంతా బాగానే ఉంది. కానీ మెడ భాగంలో నరాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. నాడీ వ్యవస్థలోని ఫ్రెనిక్ నరాలు.. ఊపిరితిత్తుల కింది భాగంలోని విభాజక పటలంతో కలుపబడి ఉంటుంది. ఫ్రెనిక్ నరాలు దెబ్బతినడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో విభాజక పటలం కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
అందువల్ల తల మసాజ్ చేసేటప్పుడు మెడలను అటుఇటు గట్టిగా తిప్పడం సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. మెడ భాగం చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి.. మెడలను గట్టిగా తిప్పడం వల్లే నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలను మసాజ్ చేయించుకోండి.. కానీ మెడలను గట్టిగా తిప్పకుండా ఉంటే ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెమటను తరిమికొట్టాలంటే.. ఇలా చేయండి