ఇష్టానుసారంగా మందులు వాడితే గుండెకు చేటు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐబూప్రొఫెన్, న్యాప్రోక్సెన్, డైక్లోఫెనాక్ వంటి నాన్‌స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వాడకంతో గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, వీటి వాడకంతో తలెత్తే దుష్ప్రభావాల గురించి చేసే హెచ్చరికను మరింత తీవ్రం చేయాలని అమెరికా ఎఫ్‌డీఏ తాజాగా నిర్ణయించింది.
గతంలో భావించిన దాని కన్నా ఈ మందులతో ముప్పు మరింత ఎక్కువగా ఉంటుండటమే దీనికి ప్రధాన కారణం. వీటిని వేసుకోవటం మొదలెట్టాక కొద్ది వారాల సమయంలోనూ గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశముందని.. మందుల మోతాదు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పులు పెరుగుతున్నాయని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. గుండెజబ్బు ఉన్నవారికే కాదు.. లేనివారికీ ఈ ముప్పులు పొంచి ఉంటుండటం గమనార్హం.
ఎన్ఎస్ఏఐడీలు రక్తంలోని ప్లేట్‌లెట్లపై ఆస్ప్రిన్ కన్నా భిన్నంగా పనిచేస్తాయి. ఇదే గుండెజబ్బు, పక్షవాతం ముప్పులకు కారణమవుతోంది. ప్లేట్‌లెట్లు ఒక దగ్గరకు చేరి, గడ్డకట్టకుండా చేసే ఎంజైమ్‌ను ఆస్ప్రిన్ అడ్డుకుంటుంది. దీన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తకుండా చేసి గుండెపోటు, పక్షవాతం బారినపడకుండా కాపాడుతుందని చెపుతున్నారు.
అయితే ఎన్ఎస్ఏఐడీలు ఈ ఎంజైమ్‌తో పాటు రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహించే మరో ఎంజైమ్ మీదా పనిచేస్తాయి. ఇది గుండెపోటు, పక్షవాతం ముప్పులు పెరగటానికి దారితీస్తోంది. అన్నిరకాల ఎన్ఎస్ఏఐడీలూ ఇందుకు దోహదం చేస్తుండటం గమనార్హం. వీటిల్లో ఏ ఒక్కటీ సురక్షితం కాదని అమెరికన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మందు మోతాదు పెరిగినకొద్దీ ముప్పులూ పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే వీటిని పూర్తిగా ఆపేయాల్సిన అవసరమేమీ లేదంటున్నారు. వాడకం తప్పనిసరి అయినప్పుడు తక్కువ మోతాదులో అదీ కొద్దికాలమే వేసుకోవాలని సూచిస్తున్నారు.