హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటిక్ కరోనా వ్యాక్సిన్ తయారీలో అద్భుతమైన పురోగతి సాధించింది. కో వ్యాక్సిన్ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ తయారీలో భాగంగా, ఇప్పటికే పలు దశలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో జూలై నెలలో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి కూడా మంజూరుచేసింది.
జూలై పదో తేదీ నుంచి చేపట్టే మానవ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వస్తే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరినాటికి భారత్ బయోటెక్ సంస్థ నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, కరోనా మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతేవేగంగా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు సాగుతున్న విషయం తెల్సిందే. అయితే వ్యాక్సిన్ ఆవిష్కరణ అనేక దశలతో కూడిన ప్రక్రియకావడంతో మార్కెట్లోకి వచ్చేందుకు మరికాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన పురోగతి కనపరుస్తూ ముందుకుసాగిపోతోంది.