పుట్టిన రోజు వేడుకలు, పెళ్ళి రిసెప్షెన్, వీకెండ్ పార్టీల్లో బిర్యానీ ముద్దలేనిదే పొద్దు గడవదు. ప్రస్తుతం వీకెండ్‌లో బిర్యానీ తినకుండా ఉండలేకపోతున్నారా... అయితే మీకు కాలేయ సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇదేంటి ఆల్కహాల్ తాగితేనే కదా కాలేయ సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు.
కేవలం బిర్యానీ లాగిస్తే కాలేయ సమస్యలు వస్తాయా ఎలా అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు.. అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయట. బిర్యానీతోపాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది.
బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని పరిశోధకులు తెలిపారు. ఒక్క బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు మనిషికి ఒకేసారి అవసరం లేదంటున్నారు.
ఎలాంటి మద్యం అలవాట్లు లేకపోయినా.. ఆల్కహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రతీ ఏడాది 30 నుంచి 35 శాతం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారట. నగరాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతినొప్పి, నీరసం వంటి లక్షణాలతో నీరు ఆస్పత్రి మెట్లెక్కుతున్నారని పరిశోధనలో తేలిపోయింది.