పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పటికబెల్లం కలగలిపిన ఆ నైవేద్యాన్ని తీసుకుంటే?

సోమవారం, 30 మార్చి 2020 (21:42 IST)
చక్కెర లేదా పటికబెల్లం, పాలు, పెరుగు, నెయ్యి, తేనెలను కలిపి పంచామృతంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. దీనినే ఆలయాల్లో పంచామృతంగా నైవేద్యంగా పెడుతుంటారు. స్వచ్ఛమైన ఆవుపాలు, తియ్యటి పెరుగు, పరిశుభ్రమైన నెయ్యి, సహజసిద్ధమైన తేనె, పటిక బెల్లంతో తయారైన ఈ పంచామృతం ఔషధ గుణాల సంజీవని అంటే అతిశయోక్తి కాదు.
 
ముఖ్యంగా పంచామృతంలో వాడే ఆవుపాలు తల్లిపాలతో సమానమైనట్టివి, శ్రేష్టమైనవి కూడా. ఈ పాలు త్వరగా జీర్ణం అవటమే గాకుండా, శరీరానికి అవసరమైన కాల్షియంను పుష్కళంగా అందిస్తాయి. కాల్షియం ఎముకల పెరుగుదలకు బాగా ఉపకరిస్తుంది. అంతేగాకుండా ఈ పాలను ఎక్కువగా తాగటంవల్ల ఒబేసిటీతో బాధపడుతున్నవారు బరువు తగ్గుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక పాలలోని విటమిన్ ఏ అంధత్వం రాకుండా అడ్డుకుంటుంది.
 
తియ్యటి పెరుగులో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. త్వరగా జీర్ణమయ్యే పెరుగు, ఉష్ణతత్వం ఉన్నవారికి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇక జీర్ణ సంబంధమైన వ్యాధులను నయం చేయటంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. జుట్టు సంరక్షణలోనూ పెరుగు ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉదయంపూట తియ్యటి పెరుగును తినటం ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది.
 
పరిశుభ్రమైన నెయ్యి మేధో శక్తిని పెంచటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద వైద్య ప్రకారం నెయ్యితో కూడిన, నెయ్యితో వేయించిన ఆహార పదార్థాలను భుజించటంవల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి ఉండేలా చూసుకోవాలి. చర్మ సౌందర్యంలోనూ నెయ్యి పాత్ర ఎక్కువేననీ ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యివల్ల ముఖం కాంతివంతమవుతుందనీ, విటమిన్ ఏ మెండుగా లభిస్తుందని ఆయుర్వేదం వివరిస్తోంది. అయితే పరిమితంగానే వాడాలి సుమా.
 
సహజసిద్ధమైన తేనెను కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవులు పోషకాహారంగా స్వీకరిస్తున్నారు. సూక్ష్మజీవులతో పోరాడటంలో తేనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లను దరిచేరనీయని తేనె, జీర్ణకోశానికి చాలా మేలు చేస్తుంది. అంతేగాకుండా ఖనిజాలు ఎక్కువ స్థాయిలో లభించే తేనె, చర్మ సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్యానికి అన్నిరకాలుగా మేలుచేసే తేనెను ఆహారంలో భాగంగా తీసుకోవటం ఉత్తమం.
 
ఇక చివరిగా చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పటికబెల్లం స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భాశయంలోని చెడు రక్తం వల్ల స్త్రీలకు ఎన్నో బాధలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు తినే సోంపుని మెత్తగా పొడిచేసి పటిక బెల్లం కలిపి ఉదయం సాయంత్రం వేడి పాలతో కలిపి తాగితే ఉపయోగం ఉంటుంది. పటికబెల్లంను చక్కెరకు బదులుగా పంచామృతంలోనూ వాడవచ్చు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ తీసుకుంటే..?