పసుపును శుభప్రదంగా భావిస్తాం. పూజా సంబంధిత కార్యాల్లోనే కాకుండా వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తాం. ఇందుకు ముఖ్యకారణం పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉండడమే. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు వివిధ దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఇప్పటికే తేలింది.
అమెరికాలోని ఎండీ అండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పసుపు తాత్కాలిక ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం ఇస్తుందని తేలింది. కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు మంచి ఫలితాన్ని ఇస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
అదేవిధంగా అల్జిమర్స్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులపై కూడా పసుపు అద్భుత ఫలితాలను ఇస్తుందని ఆ అధ్యయనం ద్వారా తేలింది.