దానిమ్మ గింజలను రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియల్, వైరల్ జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పండు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉండే ఈ గింజలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ దానిమ్మ గింజలు తినాల్సిందే. వీటిని తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదల కాదు. ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్ యాసిడ్ కాబోయే తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకూ ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణులకు కాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.
రోజూ రెండు కప్పుల దానిమ్మ రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. ఈ గింజలు తినడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.