వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం.. తగినన్ని నీరు తీసుకోండి..
వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాల
వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వడదెబ్బకు గురైన వారిలో వేవిళ్లు, తలతిరగడం, జ్వరం రావడం.. చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్‌తో పల్స్ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటంవంటి లక్షణాలు కనబడతాయి. వీటి ద్వారా ఆకస్మిక మరణం కూడా సంభవించవచ్చు. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే... శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చేయాలి.
అధికంగా ఎండలో తిరగడం ద్వారా.. మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాం. తద్వారా అత్యధికంగా వడదెబ్బతో మరణాలు చోటుచేసుకుంటాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి. బట్టలు వదులు చేసి నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్ అందించాలని వారు చెప్తున్నారు.
ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.