ఇటీవలి కాలంలో చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి మన ఆహారంలో ఓట్స్ చేర్చుకోవాలి. ఓట్స్ మంచి పౌష్టికాహారం. దీనిలోని పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధిక మోతాదులో ఉన్నాయి. అలానే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతాయి.
పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వలన మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. 40 గ్రాముల ఓట్స్‌లో ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ఉంటుంది.
ఓట్స్ రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం ఎంతగానే తోడ్పడుతుంది.
ఓట్స్‌లో ఉండే బీటా కెరోటిన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వలన చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి.