Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవి కాలంలో పండ్ల రసం తీసుకుంటే..

Advertiesment
Fruits
, సోమవారం, 11 ఏప్రియల్ 2016 (10:19 IST)
వేసవి వేడిని తట్టుకోవడానికి చల్లని నీటిని తాగడంతోపాటు తాపాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని చేకూర్చే చల్లని పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. కూల్‌డ్రింక్స్‌ను తాగడంకన్నా తాజా పండ్లరసాన్ని తాగడం, తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తాపాన్నికూడా తగ్గించుకోవచ్చు. అవేంటో తెల్సుకుందాం!
 
వేసవిలో అందరూ తాగేది నిమ్మరసం. దీనిలో అధికశాతం 'సి' విటమిన్ ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక చెంచాడు నిమ్మరసం పరగడుపున తాగితే పైత్యం తగ్గుతుంది. అరుగుదల కూడా బాగా ఉంటుంది.
 
ఈ కాలంలో అందరికీ అందుబాటుగా ఉండేది పుచ్చకాయ. దీంట్లో అధిక నీటిశాతం ఉంటుంది. దీన్ని తినడం, పుచ్చకాయ రసం చేసి దాంట్లో పటికబెల్లం వేసి తాగితే దాహం తగ్గడమే కాకుండా శరీరానికి చల్లదనాన్నిస్తుంది.
 
ఆపిల్‌ను తొక్కలు తీయకుండా లోపలి గింజలను తీసివేసి ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్‌చేసి దాంట్లో పాలు, పటికబెల్లం పొడివేసి ప్రిజ్‌లో పెట్టి తాగితే చలవచేస్తుంది. ఆపిల్‌లో ఇనుము, భాస్వరం, తగినన్ని ప్రొటీన్లు ఉంటాయి. అలాగే 'ఎ' విటమిన్ వుండటంవల్ల చర్మం కాంతివంతమవుతుంది. కళ్ళకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. 
 
బొప్పాయి పండు తినడం, రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో 'ఎ' విటమిన్ అధికంగా వుంటుంది. అంతేకాకుండా ఇనుం అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను అరికడుతుంది. వేసవి కాలంలో వచ్చే మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించే శక్తి ఈ పండులో ఎక్కువగా ఉంది.
 
కమలాపండులో విటమిన్ 'సి' సమృద్ధిగా వుంటుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. కమలాపండు తినడం, రసం తాగడం వల్ల శారీరక శక్తినివ్వడమేకాకుండా మూత్రపిండాలకు, రక్తప్రసరణకు చాలా మంచిది.
 
పైనాపిల్‌లో సహజమైన చక్కెర శాతం ఎక్కువ. ఎండవేళ నీరసంగా ఉన్న సమయంలో పైనాపిల్ రసం తాగితే తొందరగా శక్తినిస్తుంది. పండ్ల రసాలే కాకుండా క్యారెట్ జ్యూస్ కూడా శరీరానికి చాలా మంచిది. క్యారెట్లను మెత్తగా గ్రైండ్‌చేసి దాంట్లో పాలు, చక్కెర కలిపి జ్యూస్ చేసుకొని యాలుకల పొడి వేసుకొని వేసవిలో తాగితే శరీరానికి చల్లదన్నాన్ని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu