వర్షాకాలంలో, శీతాకాలంలో కారం బాగా లాగిస్తున్నారా? ఐతే ఇకపై అలా చేయకండి.. వానాకాలంలో వేడి వేడిగా వుండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. కానీ కారం అధికంగా చేర్చిన ఆహార పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. శీతాకాలంలో, వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
అందువల్ల ఈ కాలంలో బజ్జీలు, పకోడీలు, బేకరీ ఐటమ్స్ లాంటి చిరుతిళ్లు తింటే అరుగుదల కష్టం అవుతుంది. కాబట్టి వానాకాలంలో చిరుతిళ్ల జోలికి పోకుండా ఉండటం మంచిది. శాకాహారమైనా, మాంసాహారమైనా వానాకాలంలో డీప్ ఫ్రై చేసుకుని తినకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాల వల్ల దగ్గు, ఎసిడిటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో అప్పటికప్పుడు పండ్లను కట్ చేసుకుని తీసుకోవాలి. నిల్వ వుంచిన వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.
భారీ వర్షాల సమయంలో చేపలు, రొయ్యలు తింటే టైఫాయిడ్, జాండిస్, డయేరియా లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. కాబట్టి వానాకాలంలో చేపలు, రొయ్యలు జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. వర్షాకాలంలో అలర్జీ సమస్యలు కూడా బాగా వేధిస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కూరల్లో కొంతవరకు కారం తగ్గించడం మంచిది. అలర్జీలకు ఎక్కువగా గురయ్యేవాళ్లు మాత్రం కారం బాగా తగ్గించాలి.
అలర్జీ, జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, మైగ్రేన్ తలనొప్పి, సైనసైటిస్ లాంటి సమస్యలున్న వాళ్లు ఈ సీజన్‌లో పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది. చికెన్‌ను ఉడికించి తీసుకోవడం మంచిది. అలాగే మటన్‌ను బాగా ఉడికించి సూప్ రూపంలో తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. ఇంకా సూప్‌ల ద్వారా జలుబు దరిచేరదు. ఆకుకూరలు, కూరగాయలు ఉడికించి తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.