Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహం లక్షణాలు ఇవే, గుర్తించి జాగ్రత్త పడితే నియంత్రించవచ్చు: డాక్టర్ సంజయ్

Advertiesment
మధుమేహం లక్షణాలు ఇవే, గుర్తించి జాగ్రత్త పడితే నియంత్రించవచ్చు: డాక్టర్ సంజయ్
, సోమవారం, 15 మార్చి 2021 (14:16 IST)
మధుమేహం ఓ జీవక్రియ లోపం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ తగినంతగా లేకపోతే ఇది ఏర్పడుతుంది. ఈ తరహా వైద్య స్ధితి కారణంగా శరీరం తగినంతగా ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయలేదు. ఈ కారణంగానే శరీరంలోని కణజాలానికి శక్తినందించే గ్లూకోజ్‌ వాటికి చేరదు. మధుమేహ వ్యాధి ఆరంభంలో రక్తంలో అత్యధిక షుగర్‌ కంటెంట్‌ ఉండటం చేత నరాలు దెబ్బతినడం, కంటి సమస్యలు, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్‌, ఇతర గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంది.
 
మధుమేహం ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది. అవి టైప్‌ 1, టైప్‌ 2 మరియు జెస్టేషనల్‌ డయాబెటిస్‌. విభిన్న వయసు గ్రూప్‌లపై విభిన్న రకాలుగా ఈ మధుమేహం ప్రభావం చూపుతుంది. టైప్ ‌1 సాధారణంగా చిన్నపిల్లల్లో కనబడుతుంది. టైప్‌ 2 సాధారణంగా పెద్ద వయసు వారిపై ప్రభావం చూపుతుంది. ఊబకాయానికీ, దీనికి అవినాభావ సంబంధం ఉంది. ఇక మూడోదైన జెస్టేషనల్‌ డయాబెటీస్‌ సాధారణంగా గర్భిణిలకు వస్తుంటుంది.
 
మధుమేహం వచ్చే ముందు కొన్ని లక్షణాలను చూపుతుంది. ఈ వ్యాధి ముదిరే వరకూ డాక్టరును సంప్రదించే అవకాశం సాధారణంగా కలుగదు. సాధారణంగా మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు ఇలా వుంటాయి.
webdunia
తరచుగా మూత్రం రావడం: దీనినే పోలీయురియా అని కూడా అంటారు. సాధారణంగా మధుమేహానికి ఇది ముందస్తు హెచ్చరికగా చెప్పవచ్చు. తరచుగా లేదంటే అధికంగా మూత్రం పోయడం వల్ల రక్తంలో చక్కెర స్ధాయి అధికంగా ఉందని గుర్తించవచ్చు. శరీరంలో చక్కెరను బయటకు తోయడానికి మూత్రపిండాలు అధికంగా పనిచేయడం వల్ల అధికంగా మూత్రం వస్తుంది.
 
విపరీతంగా దాహం వేయడం: మధుమేహులకు దప్పిక అధికంగా ఉంటుంది. తగినంతగా మంచినీరు తాగినా సరే ఇంకా తాగాలనిపిస్తుంటుంది. అధిక బ్లడ్‌ షుగర్‌ కారణంగా మన శరీరంలోని కండరాలు, కణజాలం డీహైడ్రేట్‌ అవుతుంటాయి. రక్తంలోని చక్కెర స్ధాయిని తగ్గించడానికి ఇతర కణజాలం నుంచి ద్రవాలను లాక్కోవడానికి శరీరం ప్రయత్నిస్తుంటుంది. ఇదే ఓ వ్యక్తి అధికంగా దాహం వేస్తున్నట్లుగా భావించేందుకూ కారణమవుతుంది.
 
ఆకలి పెరుగుతుంది: దీనినే పాలీఫాగియా అని కూడా అంటారు. మధుమేహానికి ఇది మరో లక్షణం. తగినంతగా ఆహారం తీసుకున్న తరువాత కూడా ఆకలి వేయడంను అనుమానించాలి.
 
చర్మం దురద పెట్టడం: శరీరంలో అధిక చక్కెర స్ధాయి కారణంగా చర్మం దురద పెడుతుంది. చంకలు, నోరు, జననాంగాల వద్ద దురద వస్తున్నట్లుగా ఉంటుంది. అలాగే మెడ, చంకలో నల్ల మచ్చలు వస్తే మధుమేహ లక్షణంగా అనుమానించాలి.
 
గాయాలు, కురుపులు మానడానికి అధికసమయం పట్టడం: మధుమేహం కారణంగా రక్తప్రవాహం సరిగా లేక శరీరంలో అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ సరఫరా జరుగదు. దీని కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.
 
మన రోజువారీ కార్యక్రమాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహం నియంత్రించుకోవచ్చు. అధికంగా ఫైబర్‌ ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటుగా శారీరకంగా ఫిట్‌గా ఉండటం ద్వారా తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే శరీరంలో బ్లడ్‌ షుగర్‌ను పర్యవేక్షించుకోవడానికి కనీసం నెలకోమారు అయినా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది
- డాక్టర్‌ ఎల్‌ సంజయ్‌, ఇంటర్నల్‌ మెడిసన్‌ డిపార్ట్‌మెంట్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాల్షియం మాత్రలు వేసుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?