గజగజ వణికే చలి నుంచి తట్టుకునేందుకు అనేక మంది వేడివేడి తేనీరు సేవిస్తుంటారు. ఇలాంటివారి ఎముకలు మరింతగా గట్టిపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చల్లని చలిలో మంచి గరంమసాలా చాయ్ తాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అంతేకాకుండా టీ తాగడం వల్ల అలసి సొలసిన శరీరానికి ఎంతో ఉత్సాహం లభిస్తుంది. మెదడు కూడా బాగా పని చేస్తుంది. అందుకే చాలా మంది తమకు ఇష్టమైన సువాసనలతో కూడిన తేనీరును సేవిస్తుంటారు.
అయితే నిత్యం టీ తాగే అలవాటు ఉన్నవారికి ఇప్పుడు సైంటిస్టులు ఒక శుభవార్త చెబుతున్నారు. అదేమిటంటే... నిత్యం టీ తాగే వారి ఎముకలు దృఢంగా ఉంటాయట. అసలు ఎముకలు విరిగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీకి చెందిన పబ్లిక్ హెల్త్ స్కూల్ పరిశోధకులు వెల్లడించారు.
ఈ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ పరిశోధన చేశారు. నిత్యం గ్రీన్ టీ లేదా సాధారణ టీని 30 యేళ్లుగా తాగుతున్న వ్యక్తులను కొంతమందిని ఎంపిక చేసుకుని ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనంలో గత 30 ఏళ్లుగా టీ తాగుతున్న వ్యక్తులలో కీళ్లు విరిగిన సందర్భాలు చాలా తక్కువని తేల్చారు.
తమ పరిశోధనలో భాగంగా, దాదాపు 4,53,625 మందిని ప్రశ్నించారు. టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశొధకులు తేల్చారు. కనుక నిత్యం టీ తాగే అలవాటు ఉన్నవారికి ఈ అంశం ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.