Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డయాబెటిస్‌ ...ఎలాంటి ఆహారంతీసుకోవాలి?

Advertiesment
డయాబెటిస్‌ ...ఎలాంటి ఆహారంతీసుకోవాలి?
, మంగళవారం, 6 జులై 2021 (09:47 IST)
డయాబెటిస్‌ కనుగొన్న తర్వాత డాక్టర్‌ సూచించిన మందులతో పాటు వారి వారి వ్యక్తిగత బరువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆహారనిపుణులు వారికి వ్యక్తిగతంగా ఆహారపు నిబంధనలు (డైట్‌ చార్ట్‌) సూచిస్తారు. అయితే ఈ కింద పేర్కొన్నవి డయాబెటిస్‌ ఉన్నవారు పాటించాల్సిన సాధారణ ఆహార నిబంధనలు మాత్రమే.

పిండిపదార్థాల విషయానికి వస్తే అవి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ (పంచదార) పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్‌ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ ఉండే పదార్థాలను తీసుకోవాల్సి వస్తే... ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు (ఫైబర్‌) శరీరానికి ఎక్కువగా అందుతాయి.

రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలు (గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌)లోనూ, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. 
 
ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి అవసరం. ప్రోటీన్లు. గ్లూకోజ్‌ పాళ్లు పెరగకుండా చూసే అమైనో ఆమ్లాలను అందిచడంలోనూ  దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్‌ వంటివి వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి.

అంతే మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం తీసుకునే సమయంలో వేటమాంసం, రెడ్‌ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి తీసుకోవడం మంచిది. ఇక కొవ్వుల విషయానికి వస్తే మన శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరమైనందున వాటిని పూర్తిగా మానేయడం సరికాదు.

డయాబెటిస్‌ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్‌ వంటివి తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి డయాటెటిస్‌ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు.
 
ఇక నూనెల విషయానికి వస్తే పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ నూనెలైన (ప్యూఫా) పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలనూ ఉదయం వేళల్లోనూ... ఇక  మోనో అన్‌శ్యాచ్యురేటెడ్‌ నూనెలైన (మ్యూఫా) నువ్వుల నూనె, సోయానూనె, ఆలివ్‌ ఆయిల్స్‌ను సాయంత్రం వేళల్లో ఉపయోగించడం మంచిది.

ఇలా వీలు కాకపోతే ఒక నెలంతా ప్యూఫా, మరో నెలంతా మ్యూఫా నూనెలను మార్చి మార్చి ఉపయోగించడం వల్ల మధుమేహం ఉన్నవారికే గాక అందరికీ మంచిది. గుండె, శరీరానికి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఇది ఉపయోగపడుతుంది.

ఒక పరిమితి మించకుండా కొవ్వు పదార్థాలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు 50 గ్రాములకు మించి నూనె ఉపయోగించకూడదు. అంటే నెలకు 450 గ్రాములు అన్నమాట. కొండగుర్తుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు నెలకు అర్ధలీటరుకు మించకుండా నూనె వాడటం శ్రేయస్కరం.
 
డయాబెటిస్‌ రోగులు నేరుగా తీసుకోకూడని పదార్థాలు: 
 
►పంచదార / వాటితో తయారు చేసిన తీపి పదార్థాలు
►తేనె
►జామ్స్‌ / జెల్లీస్‌
►కేకులు / పేస్ట్రీలు
►పళ్లరసాలు ∙మద్యం
►(పండ్లను పండ్లరసాల రూపంలో తీసుకోవడం కంటే నారింజ, కమలాపండు, జామ, పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లను కొరికి తినడం మంచిది).
 
"డయాబెటిస్‌ ఉన్నవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు":
 
►మొలకెత్తిన గింజలు తీసుకోవడం మధుమేహరోగుల ఆరోగ్యానికి మంచిది.
 
►నేల కింద పండే దుంపలు (ఆలు, చిలగడ, కంద వంటి దుంపలు) డయాబెటిక్‌ రోగులకు మంచిది కాదు. నేల కింద పండే వాటన్నింటి నుంచి దూరంగా ఉండాలని  డయాబెటిస్‌ రోగులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ నిబంధన నుంచి ముల్లంగికి మినహాయింపు ఉంది. డయాబెటిస్‌ రోగులు ముల్లంగిని తీసుకోవచ్చు.
 
►ఈ ఆహారంతోపాటు వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడితే డయాబెటిస్‌ దుష్ప్రభావాలనుంచి దూరంగా ఉండవచ్చు.
 
బార్డర్‌లైన్‌ అంటున్నారు...డయాబెటిస్‌ వచ్చినట్టేనా?
 
నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్‌ బార్డర్‌లైన్‌లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్‌ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.             
 
మీరు పరగడుపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్‌ లేదని అర్థం.

ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన  రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్‌బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్‌ ఉన్నట్లు లెక్క.

ఇంకా చెప్పాలంటే... హెచ్‌బీఏ1సి విలువ 5.6 నుంచి 6.5 వరకు ఉన్నా లేదా పరగడుపున చేయించిన రక్తపరీక్షలో చక్కెర 100 నుంచి 125 ఉన్నా, భోజనం చేశాక రక్తంలో చక్కెర 140 నుంచి 200 లోపు ఉన్నా దాన్ని బార్డర్‌లైన్‌ డయాబెటిస్‌ అంటారు.
 
అంటే పరీక్షల్లో ఈ రీడింగ్స్‌ వస్తే వారికి డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ అన్నమాట. ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్‌ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ రాకుండా కాపాడుకునే అవకాశం ఇంకా ఉందని అర్థం.
 
డయాబెటిస్‌ ఉంది... విహారయాత్రకు సూచనలు చెప్పండి
 
నేను గత ఆరేళ్లనుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఈసారి వేసవి సెలవల్లో  ఎటైనా విహారయాత్రకు వెళ్దామనుకుంటున్నాను. ప్రయాణంలో నా చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోడానికి ఏవైనా సూచనలు చెప్పండి
 
డయాబెటిస్‌ అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన దీర్ఘకాలిక సమస్య. అంతమాత్రాన ఇది ఉన్నవారు విహారయాత్రలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం మానుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...
 
►మీరు వెళ్లబోయే ప్రదేశం ఏమిటో, అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుందో మీ డాక్టర్‌కు చెప్పండి.
 
►మీ డయాబెటిస్‌ మందులతో పాటు ఒకవేళ మీకు ప్రయాణం సమయంలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాల సమస్య వస్తే తీసుకోవాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్‌ను ఇవ్వమని కోరండి.
 
►మీరు మీ గమ్యస్థానాన్ని చేరగానే ఒకసారి మీ చక్కెర పాళ్లు పరీక్షించుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చేరాల్సిన ఆసుపత్రినీ, లేదా వైద్యసహాయం అందించే చోటును ముందే ఎంపిక చేసుకుని పెట్టుకోండి.
 
►మీరు ఇన్సులిన్‌ మీద ఉంటే ఇన్సులిన్‌ను లేదా నోటి ద్వారా తీసుకునే మందులైతే వాటిని మీతో పాటే ఉంచుకోండి. మీ ఇన్సులిన్‌ మరీ ఎక్కువ వేడి ఉండే చోట లేకుండా చూసుకోండి.
మీరు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేసుకోండి.
 
►అకస్మాత్తుగా రక్తంలో చక్కెర తగ్గే పరిస్థితి (హైపోగ్లైసీమియా) ఏర్పడితే తీసుకోడానికి కొన్ని చాక్లెట్లు కూడా మీతో ఉంచుకోండి. 
 
షుగర్‌ తగ్గినా ప్రమాదమా? 
మా అమ్మగారి వయసు 68 ఏళ్లు. చాలా ఏళ్లుగా ఆమె డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్‌ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్‌ పెరిగితే కదా ప్రమాదం. ఇలా షుగర్‌ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా?
 
ఒక్కోసారి పెద్దవయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. దాంతో వారి రక్తంలోని చక్కెరపాళ్లు  తగ్గుతాయి. అలా తగ్గడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల వృద్ధులైన రోగుల్లో వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలకు బదులుగా నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, నిస్సత్తువ, భ్రాంతులు, అయోమయం వంటివి అన్నమాట.

ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. ఇలా రక్తంలోని చక్కెరపాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినాలి. రోజూ సరైన వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగస్వామిని సుఖపెడుతుంటే నిలువునా చీలిన పురుషాంగం...