ఇపుడు ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నప్పుడు శరీరం శక్తి పుంజుకుంటుంది. మెంతికూర, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలను డైలీ డైట్‌లో భాగం చేయండి. వీటిలో పైన చెప్పిన పోషకాలు పుష్కలం.
ఈ ఖనిజాలు తీసుకోవడం వల్ల మానసిక సమతుల్యత సైతం ఏర్పడుతుంది. ఇలాంటి ఆకుకూరల్ని రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకుంటే ఎంతో మంచిది.
మీ శరీరం ఉరకలెత్తే ఉత్సాహంతో ఉండాలంటే తగినంత షుగర్ కూడా అవసరం. అది కూడా న్యాచురల్ షుగర్ అయితేనే మంచిది. తాజా పండ్లు, ఎండు ఫలాలు, అడవి తేనె మంచివి.
తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి పూట మంచి నిద్ర కలుగుతుంది. రోజుకొక స్పూను తేనె తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు.
విటమిన్ 'ఇ', విటమిన్ 'బి'లతో పాటు అనేక పోషకాలు ఆల్మండ్స్ వల్ల లభిస్తాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఇమ్యూనిటీ దెబ్బతినకుండా కాపాడతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచే అధిక ఖనిజాలు చిలగడదుంపల్లో అధికం. ఇవి ఒత్తిడి మీద యుద్ధం చేస్తాయి. బాగా ఉడికించిన దుంపల్ని అప్పుడప్పుడు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.