ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల్లో కనిపిస్తున్న వ్యాధి మంకీపాక్స్. గతంలోనూ ఇది విజృంభించింది. మళ్లీ మరోసారి పంజా విసురుతోంది. ఈ మంకీపాక్స్ సోకినవారిలో ఎలాంటి లక్షణాలు కనబడుతాయో తెలుసుకుందాము.
ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, తక్కువ శక్తి, శోషరస గ్రంథులు వాపు వంటివి కనిపిస్తాయి. ఇవి అత్యంత సాధారణ లక్షణాలు. వీటిలో అత్యంత ప్రధానమైన లక్షణం ఎలా వుంటుందంటే, ఈ వైరస్ సోకిన వ్యక్తికి రెండు నుంచి మూడు వారాల్లో శరీరం అంతటా దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి. దద్దుర్లు ముఖం, అరజేతులు, పాదాల అరికాళ్లు, కళ్లు, నోరు, గొంతు, గజ్జలు, శరీరంలోని జననేంద్రియాలు, పిరుదుల ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి.
ఈ వైరస్ సోకిన వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే, కలుషితమైన పరిసరాలను శుభ్రపరచడం, క్రిమిసంహారకం చేయడం అవసరం. మంకీపాక్స్ ఉందని భావిస్తే వైద్య సలహాను తీసుకోవాలి. అనుమానం ఉంటే వైద్యులు పరీక్షించి వ్యాధి లేదని చెప్పేంతవరకు మిగిలినవారికి దూరంగా ఉండటం చాలా మంచిది.
వ్యాధి సోకితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
మంకీపాక్స్ సోకిన రోగులను ఇతరుల నుండి వేరుచేయాలి.
చేతులను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించాలి.
వ్యాధి సోకిన వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు, మాస్క్‌లు- డిస్పోజబుల్ గ్లోవ్స్ ధరించండి.
పర్యావరణ శానిటైజేషన్ కోసం క్రిమిసంహారకాలను ఉపయోగించండి.
వ్యాధి సోకినవారు మూడు లేయర్ల మాస్కు ధరించాలి. దద్దుర్లు బయట గాలికి తగలకుండా వుండేందుకు చర్మాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులు ధరించాలి.
మంకీపాక్స్ వచ్చినప్పుడు చేయకూడనివి ఏమిటి?
మంకీపాక్స్ సోకిన వ్యక్తులు ఉపయోగించే టవల్స్, దుప్పట్లు, పరుపు పంచుకోరాదు.
మంకీపాక్స్ సోకిన వ్యక్తుల దుస్తులను మిగిలినవారి దుస్తులతో కలిపి ఉతకరాదు.
మంకీపాక్స్ లక్షణాలు కనబడినప్పుడు పబ్లిక్ ఈవెంట్‌లకు హాజరు కారాదు.
తప్పుడు సమాచారం ఆధారంగా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదు.