నేటి పోటీ ప్రపంచంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ పరుగులు తీస్తున్నారు. తద్వారా ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌తో నీళ్లు తాగడం తక్కువైంది. మూత్ర పిండాలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. శరీరంలో నీటి శాతం తక్కువైతే కిడ్నీల్లో రాళ్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే మానవ శరీరంలో ఏర్పడే మలినాలను బయటకు పంపేవి కిడ్నీలే. అవి నీటి ద్వారానే మలినాలను బయటకు పంపుతాయి.
అయితే శరీరంలో నీటి శాతం తగ్గడంతో మూత్ర పిండాలు మలినాలను బయటకు పంపాలంటే వాటికి శ్రమ అధికమవుతోంది. ఫలితంగా కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కిడ్నీల పనితీరు బాగుండాలంటే రోజుకు కనీసం ఎనిమిది నుంచి 10 గ్లాసుల నీటిని తప్పక తాగాలని వైద్యులు పేర్కొంటున్నారు.
కిడ్నీల భద్రతకు మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చ కూరగాయలు, గింజ ధాన్యాలలో మెగ్నీషియం ఎక్కువగా లభ్యమవుతుంది. కూరగాయలు, పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని అదనపు యాసిడ్లను బయటకు పంపడానికి ఉపకరిస్తాయి. కిడ్నీలు రెండిటింలో ఒకటి చెడిపోయినా ఒక్క కిడ్నీతో కూడా జీవనం సాఫీగానే సాగిపోతుంది. కిడ్నీలు చెడిపోవటానికి హై-బీపీ, డయాబెటిస్‌లు ముఖ్య కారణాలుగా ఉంటాయి. కాబట్టి వాటిని దరిచేరనీయకుండా జాగ్రత్తపడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.