పిల్లలూ... అమ్మానాన్నల జుట్టూ, మన జుట్టూ నల్లగా, ఒత్తుగా, నిగనిగలాడుతూ ఉంటుంది కదా.. మరి నాయనమ్మ, అమ్మమ్మలు, తాతయ్యల జుట్టు మాత్రం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. మరి మనకు మాత్రం నల్లగా ఉండి, ముసలివాళ్లకు మాత్రం జుట్టు తెల్లగా ఉండేందుకు కారణమేంటో తెలుసా...?!
మన వెంట్రుకలు నల్లగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆయా వ్యక్తుల శరీరంలోని మెలనోసైట్లు అనబడే కణాలు సహాయం చేస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ కణాల పని సామర్థ్యం కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. తద్వారా ఫోలికల్స్ నుండి బయటికి వచ్చే వెంట్రుకలకు తక్కువ మొత్తంలో రంగుకు సంబంధించిన రసాయనాన్ని అందజేస్తుంది.
కాబట్టి వెంట్రుకలు నల్లగా కాకుండా గోధుమ రంగులో వస్తాయి. క్రమేణా మెలనోసైట్ల పని సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాలలో వెంట్రుకలు వాటి సహజసిద్ధమైన ప్రోటీన్ రంగులోకి అంటే తెలుపు రంగులోకి వస్తాయి. ఇదండి పిల్లలూ... తెల్ల వెంట్రుకల కథా, కమామీషు...!