పిల్లలూ... మామిడి, వేప, గులాబీ లాంటి చెట్ల చిగుళ్లు లేత గులాబీ రంగులో లేదా ఎర్రగా ఉండటం అందరికీ తెలిసిందే. ఇవే క్రమేణా ఆకుపచ్చరంగులోకి మారుతుంటాయి కదా.. అసలు లేత చిగురుటాకులు ఎర్రగా ఉండి, ఆ తరువాత పచ్చగా మారడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా...!!
చెట్ల ఆకుల్లోని ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఉదాహరణకు క్లోరోఫిల్ అనే పదార్థానికి ఆకుపచ్చ రంగు, కెరోటిన్‌కి పసుపుపచ్చ రంగు ఉంటాయి. ఒక ఆకులో రంగు రంగుల పదార్థాలు ఉండడంవల్ల అది ఆయా రంగుల మిశ్రమం కలగలిపిన రంగుని వెదజల్లుతుంది. కాబట్టి, ఈ ఆకుల్లో చాలా వరకు క్లోరోఫిల్, కెరోటిన్ పాళ్ళు ఎక్కువగా ఉండడంవల్ల అవి ఆకుపచ్చగా కనబడతాయి.
మరి కొత్తగా ఏర్పడిన చిగురుటాకుల్లో ఏ పదార్థం ఉంటుందో తెలుసా? ఎండోసైనిన్ అనే ఎరుపురంగు గల పదార్థం. అదీ ఎక్కువ శాతంలో ఉంటుంది. ఆ పదార్థం తక్కువ శాతంలో ఉన్న ఇతర పదార్థాలతో కలవడంతో ఆకులు లేతగా ఉన్నప్పుడు లేత ఎరుపు, లేత గులాబీ రంగులో ఉంటాయి.
ఇవే ఆకులు ముదిరేకొద్దీ క్లోరోఫిల్, కెరోటిన్ పదార్థాల శాతం ఎక్కువ కావడం, దాంతో అవి ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతాయి. తర్వాత రోజుల్లో ఆకులు మందంగా పెరిగి, కెరోటిన్ పదార్థం శాతం ఎక్కువ అవడంతో పసుపుపచ్చగా మారి, అంటే పండుటాకులై ఎండి చెట్ల నుండి రాలిపోతాయన్నమాట...!!