కాయిన్ కంటే ఆకారంలో చిన్నదిగా ఉండే ఒక కొత్తజాతి కప్ప ఇప్పుడు బెకబెకమంటూ శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. యూ.ఎస్. శాస్త్రవేత్తలు పాపువా న్యూగినియా ఉష్ణమండల దీవిలోని వర్షారణ్యంలో ఆకు చాటునుండి తొంగిచూస్తున్న దీన్ని ఇటీవలే కనుగొన్నారు. లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్ ఆస్టిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని చిట్టికప్ప అనాలా, చిరుకప్ప అనాలా లేక బుల్లి కప్ప అనాలా అని శాస్త్రవేత్తలు తేల్చుకోలేకపోతున్నారు.
ఎందుకంటే ఇపుడు ఇలా పిలుస్తున్న కప్పల కంటే కూడా ఈ కొత్తరకం కప్ప అత్యంత చిన్నది. దీన్ని పట్టుకోవాలంటే చేతికి చిక్కనంత చిన్నదిగా ఉండటంతో జారిపోతుంది. పదిలంగా పట్టుకుని మన రూపాయి నాణెంపై ఉంచితే, ఇంకా దీని జాతి కప్పలు మరో రెండు ఆ నాణెంపై కూర్చునే చోటుంటుంది. దీని సైజు ఎంతో తెలుసా? కేవలం 7.7 మిల్లీమీటర్లే. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు పెడోఫ్రైన్ అమాన్యుఎన్సిస్. దీని సైజుకంటే పేరే పొడవుగా ఉన్నట్లనిపిస్తోంది కదూ!
ఇప్పటి వరకు 8 మిల్లిమీటర్లు మాత్రమే ఉండే పెడోసైప్రిస్ ప్రోజెనెటికా అనే ఇండోనేషియన్ చేపే ప్రపంచంలోనే అతి చిన్న వెన్నుముక కలిగిన జీవి అని భావించారు. ఇప్పుడు దాన్ని పక్కకు తోసేసి ఈ కప్ప వచ్చి కూర్చుంది. సంభోగం కోసం పెద్ద స్థాయిలో ధ్వని చేస్తూ తోటి జాతి కప్పలను ఆకర్షించే ఈ పెడోఫ్రైన్ అమాన్యుఎన్సిస్ మగ కప్పలను గుర్తించడం చాలా కష్టం.
కీటకాల సైజుకు పోటీపడేంత చిన్నదిగా ఉన్న దీన్ని కనుగొనడం చాలా గొప్ప విషయం అని ఆ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్ ఆస్టిన్ అంటున్నారు. గోధుమ రంగు, నీలం-తెలుపు మచ్చలతో ఉండే ఈ కప్పలు బయటి ప్రపంచానికి కనపించకుండా రెయిన్ ఫారెస్ట్ నేలపై వాటి కన్నా చిన్నగా ఉండే పురుగులను తిని జీవిస్తుంటాయని. వీటికి గల అతిచిన్న శరీరం ఒక విధంగా వీటికి అదృష్టమనే చెప్పవచ్చు. ఈ అతి చిన్న శరీరాలతో ఇవి శత్రువుల కంటపడకుండా ఎక్కువ కాలమే జీవిస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడే విషయంలో వీటికి ప్రముఖ స్థానమే ఉందని పరిశోధకులు చెపుతున్నారు.