"మినరల్ వాటర్" బలవర్ధకమైనదేనా..?
పిల్లలూ..! స్కూల్‌కెళ్లేటప్పుడు లంచ్ బ్యాగ్‌తో పాటు వాటర్ బాటిల్ కూడా అమ్మ సర్దేస్తుంటుంది కదూ..?! స్కూల్లోనూ.. బయటి ప్రాంతాల్లోనూ నీళ్లు తాగవద్దనీ, బాటిల్‌లోని నీటినే తాగమని కూడా అమ్మ చెబుతుంటుంది. దానికి కారణం కలుషితమైన నీరు మీ చిన్నారి ఆరోగ్యాలను దెబ్బతీస్తుందన్న భయమే. అందుకే ఇంట్లోని మినరల్ వాటిల్ క్యాన్‌లోంచి శుభ్రమైన బాటిల్‌లో నీటిని నింపి పంపుతుంటుంది అమ్మ.ఆ సంగతలా కాసేపు పక్కన పెడితే.. శక్తిని సమకూర్చే లక్షణం మినరల్ వాటర్‌కు ఉంటుందనే ఉద్దేశ్యంతో, ధరను లెక్కచేయకుండా ఆ నీరు నింపిన బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు చాలామంది. మన ఇళ్లలో వాడే మినరల్ వాటర్ క్యాన్లు కూడా అందులో భాగమే. అయితే ఈ మినరల్ వాటర్‌లో మామూలు నీటికంటే బలవర్థకమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి.మామూలు నీటికంటే మినరల్ వాటర్‌లో బలవర్థకమైన లక్షణాలు లేవనే చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. మినరల్ వాటర్ అని చెప్పబడే నీటిలో స్వచ్ఛమైన, శక్తినిచ్చే లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయట. కాబట్టి.. ఇప్పుడు మామూలుగా దొరికే కుళాయి నీటినే సాధారణ పద్ధతుల్లో వడగట్టి మినరల్ వాటర్‌గా అమ్ముతుంటారట.అయితే కొన్ని కంపెనీలు మాత్రం "రివర్స్ ఆస్మాసిస్" అనే ప్రక్రియ ద్వారా నీటిని శుద్ధి చేస్తే.. మరికొన్ని కంపెనీలు మెగ్నీషియం కార్బొనేట్, పొటాషియం కార్బొనేట్ లాంటి ఖనిజలవణాలను కలిపి మినరల్ వాటర్‌ను తయారు చేస్తున్నాయి. ఈ విధంగా తయారైన మినరల్ వాటర్ మామూలు కుళాయి నీటికంటే స్వచ్ఛమైనదేగానీ.. సహజంగా లభించే మినరల్ వాటర్ కంటే రుచికరమైనదీ, శక్తివంతమైనదీ మాత్రం కాదని అంటున్నారు పరిశోధకులు.