పిల్లలూ... బ్లాక్ హోల్స్‌ను తెలుగులో కృష్ణ బిలాలు అని అంటారు. ఆకాశంలో మనకు చుక్కల్లాగా కనిపిస్తుండే నక్షత్రాలు... వాటి స్వరూపాలు, వయస్సు, పదార్థ ద్రవ్య రాశుల ఆధారంగా రకరకాలుగా మారి చివరి దశకు చేరుకుంటాయి. కొన్ని నక్షత్రాలు వాటిలో ఉండే హైడ్రోజన్ ఇంధనం పూర్తిగా ఖర్చయిపోయాక ఇక ఏ మాత్రం శక్తిని విడుదల చేయలేకుండా అయిపోతాయి.
అలాంటప్పుడు అలాంటి నక్షత్రాలలో ఉండే హీలియం తదితర పదార్థాల కేంద్రకాలను విడిగా ఉంచే ఉష్ణ శక్తి నశించిపోతుంది. దాంతో ఆ పదార్థాలన్నీ అంతరంగికంగా గురుత్వాకర్షక బలానికి లోనై, ఆవగింజంత పరిమాణం (చిన్న సైజు)లోకి కుంచించుకుపోతాయి. ఇలాంటి వాటినే కృష్ణ బిలాలు లేదా బ్లాక్‌హోల్స్ అంటారు.
అయితే అన్ని నక్షత్రాలూ బ్లాక్ హోల్స్‌గా మారాలని ఏమీ లేదు. సూర్యుడికంటే సుమారు ఒకటిన్నర రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినట్టివే కృష్ణబిలాలుగా మారతాయని ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు కూడా. దీన్నే చంద్రశేఖర్ అవధి (చంద్రశేఖర్ లిమిట్) అని అంటారు. కాబట్టి, ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కృష్ణబిలంగా మారే అవకాశమే లేదట పిల్లలూ..!