బాలలూ... అత్యంత వేగంగా పెరిగే నీటి మొక్క ఏదో తెలుసా..?
, శనివారం, 10 సెప్టెంబరు 2011 (11:56 IST)
పిల్లలూ... మీరు చాలా విషయాలు పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు. కానీ కొన్ని విషయాలు మీకు ఇప్పటికీ తెలిసి ఉండకపోవచ్చు. మొక్కల్లో అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏదో ఎంతమందికి తెలుసు...? తెలిసిన వారుంటే సరే.. కానీ తెలియనివారి కోసం ఇది చదవండి. వాటర్ హయసింత్ అనే నీటిమొక్క చాలా వేగంగా పెరుగుతుంది. ఇది దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందినదైనా ఇంచుమించు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దీనికి గుంట ఆకారంలో ఉండే పువ్వులు పూస్తాయి. అందుకే మొదట్లో దీనిని ఇతర ప్రాంతాల వారు కూడా పెంచడానికి ఇష్టపడ్డారని భావిస్తున్నారు. ఈ మొక్కలు చాలా త్వరగా పెరగడం వల్ల వీటి సంఖ్య రెండు వారాల్లోనే రెట్టింపవుతుంది. సరస్సులో వీటి పెరుగుదల పడవ ప్రయాణాలకి, చేపలు పట్టడానికి అడ్డంకిగా మారుతుంది. ఈ మొక్కల వల్ల దోమలకు మంచి నివాసం దొరికి వాటి సంఖ్యతో పాటు వ్యాధులు కూడా పెరుగుతాయి. అందువల్ల వీటిని కలుపు మొక్కలుగా భావించి వీటి నిర్మూలనకి ప్రయత్నిస్తుంటారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ పైలట్లు ఈ మొక్కలతో నిండి ఉన్న చెరువులను పొలాలుగా భావించేవారట. దానితో యుద్ధ విమానాలను అక్కడ దించడానికి ప్రయత్నించడంతో అవి కూలిపోయేవట. అందుకే వాటిని జపాన్ జబారా అంటారు.