ఫ్రిజ్‌లో అప్పుడప్పుడు చప్పుడు.. ఎందుకట..?
పిల్లలూ..! మన ఇళ్లలోని ఫ్రిజ్ అప్పుడప్పుడూ చిన్నపాటి శబ్దం చేస్తూ ఉంటుంది గమనించారా..? అసలు ఫ్రిజ్‌లోంచి ఆ శబ్దం ఎందుకు వస్తుందంటే.. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలిగించే కంప్రెషర్ ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు చర్యలు జరిగినప్పుడే మనకు శబ్దం వినిపిస్తూ ఉంటుందన్నమాట...!ఫ్రిజ్‌లోని కంప్రెషర్‌ను, ఉష్ణోగ్రతను కొలిచే థర్మోస్టాట్ అనేది నియంత్రిస్తూ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత శూన్యానికి అంటే సున్నా డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకోగానే.. ఇక అంతకన్నా తగ్గాల్సిన అవసరం లేకపోవటంతో.. థర్మోస్టాట్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోయే ఏర్పాటు ఉంటుంది. ఇలా ఎప్పుడయితే జరిగిందో మరుక్షణం కంప్రెషర్ కూడా ఆగిపోతుంది. అప్పుడే ఫ్రిజ్‌లోంచి శబ్దం వినిపిస్తుంది.అయితే.. కాసేపటికే మనకు ఏదైనా వస్తువు అవసరమై ఫ్రిజ్ తలుపు తీయటంవల్లనో, లేకపోతే దాంట్లో లీకేజీవల్లనో చల్లదనం తగ్గిపోతుంది. ఫలితంగా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత సున్నా స్థాయి నుంచి పెరగటం ప్రారంభం అవుతుంది. ఒక స్థాయికి పెరిగిన తరువాత థర్మోస్టాట్ ద్వారా సంకేతం అంది మరలా కంప్రెషర్ ఆన్ అవుతుంది. దాంతో మళ్లీ ఫ్రిజ్ నుంచి శబ్దం వస్తుంది.