తొలి టెస్ట్ క్రికెట్ విజయ సారథి "లాలా అమర్‌నాథ్"
భారతదేశానికి టెస్ట్ క్రికెట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్, టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు లాలా అమర్‌నాథ్. 1933వ సంవత్సరం నుంచి 1952 సంవత్సరాల వరకు సుదీర్ఘంగా 19 సంవత్సరాలపాటు మనదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఈ కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్ జన్మదినం సందర్భంగా ఆయన గురించి కాస్త ముచ్చటిద్దాం...పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాలాలో 1911వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన లాలా అమర్‌నాథ్ జన్మించారు. దేశ విభజన తరువాత క్రికెట్‌లో భారత దేశానికి నాయకత్వం వహించిన తొలి కెప్టెన్ అయిన ఈయన కుమారులు సురీందర్ అమర్‌నాథ్, మోహిందర్ అమర్‌నాథ్‌లు కూడా టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినవారే...!1933
వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన లాలా అమర్‌నాథ్ తొలి సెంచరీని నమోదు చేశారు. అదే టెస్ట్ క్రికెట్‌లో భారతీయుడు సాధించిన తొలి శతకంగా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. అంతేగాకుండా తొలి టెస్ట్‌లోనే తొలి సెంచరీని సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా కూడా ఈయన రికార్డు సృష్టించారు.1952
వ సంవత్సరం వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్‌నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించగా.. అందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో బౌలింగ్ కూడా చేసిన అమర్‌నాథ్ తన క్రీడా జీవితంలో మొత్తంమీదా 45 వికెట్లను సైతం పడగొట్టారు. తన బౌలింగ్ ద్వారా డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను హిట్ వికెట్ ద్వారా అవుట్ చేసిన ఏకైక బౌలర్‌గా కూడా ఈయన చరిత్ర సృష్టించారు. వికెట్ కీపర్‌గా కూడా జట్టులో పాల్గొన్న లాలా... జాతీయ భారత జట్టుతో పాటు గుజరాత్, హిందూస్, మహారాజ ఆఫ్ పాటియాలాస్ ఎలెవన్, రైల్వేస్, సదరన్ పంజాబ్, ఉత్తర ప్రదేశ్ జట్లలో కూడా ఆడారు.రెండుసార్లు, రెండు టెస్ట్ సిరీస్‌లలో లాలా అమర్‌నాథ్ భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించారు. ఈ రకంగా ఆయన పటౌడీ సీనియర్ తరువాత ఓసారి, విజయ్ హజారే తరువాత మరోసారి జట్టు పగ్గాలను చేపట్టారు. ఇకపోతే తొలిసారిగా మన దాయాదిదేశం పాకిస్తాన్‌ను టెస్ట్ సిరీస్‌లో తన నాయకత్వంలో ఓడించిన ఘనతను కూడా లాలా అమర్‌నాథ్ సొంతం చేసుకున్నారు. ఈ విధంగా తన క్రీడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను, కీర్తి కిరీటాలను సాధించటమేగాక.. తన కుమారులను సైతం క్రికెట్‌లోకి తీసుకొచ్చి, భారత క్రికెట్ చరిత్రలో సముచిత స్థానాన్ని సంపాదించిన లాలా అమర్‌నాథ్ 2000, ఆగస్ట్ 5వ తేదీన న్యూఢిల్లీలో, 88 ఏళ్ల ప్రాయంలో కన్నుమూశారు. లాలా మరణించినప్పటికీ ఆయన జ్ఞాపకం మాత్రం భారత క్రికెట్ ఉన్నంతవరకూ క్రీడాభిమానులు మనసుల్లో చిరస్థాయిగా వెలుగొందుతూనే ఉంటుందన్నది సత్యం.