చీకట్లో పిల్లిగాడి కళ్లు మెరుస్తుంటాయెందుకు..?
చీకట్లో మనకి మనిషి ఎదురుగా వస్తున్నా గుర్తించటం కష్టం. ఏదైనా అలికిడి అయితే తప్ప ఎదురుగా ఎవరో వస్తున్నారన్న సంగతిని గుర్తించలేం. అయితే మన పిల్లిగాడు వస్తే మాత్రం సులభంగా కనిపెట్టేయవచ్చు. ఎందుకంటే చీకట్లో దాని కళ్లు జిగేల్‌మని మెరుస్తుంటాయి కాబట్టి. అది సరేగానీ పిల్లలూ.. అసలు పిల్లి కళ్లు చీకట్లో అలా ఎందుకు మెరుస్తుంటాయో తెలుసా..?సాధారణంగా పిల్లి, మనిషి కళ్ల నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటాయి. కళ్లలో ఉండే కనుపాప (ఫ్యూపిల్) లోనికి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని అదుపు చేస్తుంటుంది. అధిక కాంతి ఉన్నప్పుడు తక్కువ వెలుతురు ప్రవేశించేందుకు వీలుగా కనుపాప మూసుకు పోతుంటుంది.అలాగే మసక వెలుతురులో వీలైనంత ఎక్కువ కాంతిని కంటిలోనికి కనుపాపలు అనుమతిస్తుంటాయి. అయితే రాత్రివేళల్లో చురుకుగా తిరిగే పిల్లిలాంటి నిశాచర జీవుల విషయానికి వస్తే... వాటి కంటి వెనుకభాగంలో "టేపెటమ్ ల్యూసిడమ్" అనే ఒక విధమైన మెరిసే పొర ఉంటుంది.ఈ మెరిసే పొర వలన కాంతి రెటీనా మీదకు ప్రతిఫలిస్తుంటుంది. దాని వల్ల మసక చీకటిలో సైతం నిశాచర జంతువులు హాయిగా చూడగలుగుతాయి. కాబట్టి.. పుట్టుకతోనే పిల్లి కళ్లకు మెరిసే పొర అమర్చబడి ఉండటంవల్ల.. చీకట్లో వాటిమీద కాంతి ప్రసరించినప్పుడు కళ్లు జిగేల్మని మెరుస్తుంటాయని అర్థమైంది కదూ...?!