చల్లని రాజా ఓ చందమామ.. నీ కథలన్నీ తెలిశాయిలే..!
"
చల్లని రాజా ఓ చందమామ.. నీ కథలన్నీ తెలిశాయి ఓ చందమామ.. నా చందమామ" అని మన సినీ కవులు ఎప్పుడో పాటలు అల్లి పాడేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే..! చంద్రుడి వద్దకు వెళ్లకపోయినా.. రాత్రిపూట కురిసే పండువెన్నెల హాయిని అనుభవించిన సదరు సినీ కవులు వారి కల్పనా చాతుర్యంతో చందమామ చల్లనివాడు అంటూ వర్ణించేశారు.. వారి సంగతలా ఉంచితే... మన విశాల సౌర కుటుంబంలో అత్యంత శీతల ప్రదేశం చందమామ మీదనే ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు తేల్చి చెబుతున్నారు పిల్లలూ...!అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా చందమామకు సంబంధించిన ఉష్ణోగ్రతా చిత్ర పటాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. ఈ పరిశోధనలో వారు పలు ఆసక్తికరమైన అంశాలను కనుగొన్నారు. అవేంటంటే.. మన సౌర కుటుంబంలో సూర్యుడికి దూరంగా ఉండే ప్లూటోపై అతి శీతల వాతావరణం ఉంటుందని ఇప్పటిదాకా అందరూ భావిస్తూ వస్తున్నారు.అయితే.. అది నిజం కాదని తాజా పరిశోధన వెల్లడిస్తోంది. మన జాబిల్లి దక్షిణ ధ్రువంలో ప్లూటోకంటే ఇంకా ఎక్కువ చల్లని వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చందమామపై ఈ ప్రాంతంలో అగ్ని పర్వత బిలాల వంటివి కొన్ని ఉన్నాయనీ... ఆ ప్రాంతాన్ని సూర్య కిరణం అన్నదే ఎన్నడూ తాకలేదనీ, ఎప్పటికీ తాకదని వారంటున్నారు. అంతేగాకుండా ఈ ప్రాంతంలో మాటల్లో చెప్పలేనంత చల్లదనం ఉంటుందని వారు ఖచ్చితంగా తేల్చి చెబుతున్నారు.అంతేగాకుండా... అంత చల్లని ప్రదేశం మన సౌర కుటుంబంలో మరొకటి లేదని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. చందమామమీది ఈ ప్రాంతంలో సున్నాకంటే తక్కువగా అంటే.. మైనస్ 238 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లుగా వారు లెక్కగట్టారు. ఫ్లూటోతో పోల్చినట్లయితే.. ఇక్కడ ఒక డిగ్రీ అధికంగా చల్లదనం ఉన్నదని వారు వివరించారు. సో.. మన సినీకవులు, లేదా మరెవరో చెప్పినట్లుగా... తన చల్లని చూపుల చల్లదనమనే వెన్నెల హాయిని లోకానికంతటికీ.. వెచ్చగా పంచుతున్న మన మామ.. చందమామకు హ్యాట్సాఫ్...!!