ప్రముఖ తెలుగు రచయిత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి గెలుపొందిన "గాలివాన" కథారచయిత అయిన పాలగుమ్మి పద్మరాజు జన్మదినాన్ని చరిత్రలో జూన్ 24వ తేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, హేతువాది, ఎం.ఎన్.రాయ్ భావ ప్రచారకుడూ అయిన పాలగుమ్మి తన జీవితకాలమంతా రచనలతోనే జీవనం సాగించారు.పాలగుమ్మి జీవిత విశేషాల్లోకి అలా తొంగిచూస్తే... 1915 జూన్ 24వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలంలోని తిరుపతిపురంలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా స్వస్థలంలోనూ, ఇతర ప్రాంతాలలోనూ పూర్తి చేసుకున్న ఈయన 1939వ సంవత్సరం నుండి 1952 వరకు కాకినాడలోని పీ.ఆర్. ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా విధులు నిర్వహించారు.పాలగుమ్మి పద్మరాజు తన సాహిత్య జీవనయానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు... ఇంకా లెక్కలేనన్ని నాటికలు మరియు నాటకాలను రచించారు. ఈయన రాసిన 60 కథలలో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి."గాలివాన"తో ప్రపంచ ఖ్యాతి |
|
తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈ కథను ప్రపంచంలోని అనేక బాషలలోకి అనువదించారంటే ఆ నవల సాహితీ ప్రపంచంలో ఎంతగా పేరుతెచ్చుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. |
|
|
పద్మరాజు 23 ఏళ్ల వయస్సులో తన మొదటి కథ "సుబ్బి"ని రచించారు. ఈయన ఎన్నో కథలు రాసినప్పటికీ వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చిన కథ "గాలివాన" మాత్రమే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని "హెరాల్డ్ ట్రిబ్యూన్"వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీలలో రెండువ బహుమతిని గెలుచుకుంది.
ఈ పోటీలకుగానూ మొత్తం 23 దేశాల నుంచి 59 కథలు ఎంపిక కాగా, అందులో భారత్ నుంచి మూడు కథలు ఎంపికవగా.. అందులో గాలివాన ఒకటి. ఈ కథను ప్రపంచంలోని అనేక బాషలలోకి అనువదించారంటే ఆ నవల సాహితీ ప్రపంచంలో ఎంతగా పేరుతెచ్చుకుందో ఇట్టే అర్థమవుతుంది.
ఈ రకంగా తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈయన రాసిన నవలలో బతికిన కాలేజీ, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన మొదలైన రచనలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే... 1954వ సంవత్సరంలో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, తాను వాహినీ పతాకం కింద నిర్మించిన "బంగారు పాప" అనే చిత్రానికి మాటలు రాయమని పద్మరాజును కోరారట. ఇక అప్పటినుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు అనేక సినిమాలకు కథలు, పాటలు పాలగుమ్మి కలంనుంచి జాలువారాయి.
ఆ తరువాత భక్త శబరి, బంగారు పంజరం లాంటి అనేక సినిమాలలో పాలగుమ్మి పనిచేసినా... తన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, వ్యాపారపరంగా నష్టాలను చవిచూశాయి. పాలగుమ్మి దర్శకుడిగా "బికారి రాముడు" అనే సినిమాను తీసినా అది కూడా విజయవంతం కాలేదు.
ఆ తరువాత పాలగుమ్మి నవల "నల్లరేగడి"ని "మాఊరి కథ" అనే పేరుతోనూ, "పడవ ప్రయాణం" అనే కథను "స్త్రీ" పేరుతోనూ సినిమాలుగా తీశారు. అదలా ఉంచితే, దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాలకు చాలా వాటికి పాలగుమ్మి ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు. సాహితీ వినీలాకాశంలో ఓ వెలుగువెలిగిన అచ్చ తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు 1983లో తుదిశ్వాస విడిచి, ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు.