"కోతి కొంచెం.. తోక ఘనం" అనిపించే 'మురాస్'..!
కోతులన్నీ ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటి కోతి గురించే..! స్కేల్ అంత పొడవు కూడా ఉండని ఈ కోతిని ఇటీవలనే కనుగొన్నారు. దీన్ని చూస్తే "కోతి కొంచెం.. తోక ఘనం" అనకుండా ఉండలేం. ఎందుకంటే దానికంటే దాని తోక ఎక్కువ పొడవుగా ఉంటుంది కాబట్టి. ఇక మన కోతిగారి వీపు భాగం అంతా రకరకాల రంగులతో మిలమిలలాడిపోతూ భలేగా ఉంటుంది.వివరాల్లోకి వస్తే... "శాడిల్ బ్యాక్ టామరిన్స్" అనే కోతులకు చెందిన ఈ కోతి, ఓ సరికొత్త జాతికి చెందినదిగా జీవశాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇంగ్లీషులో శాడిల్ అంటే గుర్రంమీద వేసే జీను. ఈ కోతి వీపు భాగం కూడా జీను వేసినట్లుగా ఉంటుంది కాబట్టి.. శాస్త్రవేత్తలు ఆ పేరు పెట్టారు.ఇక మన కోతిగారు ఎక్కడ కనిపించారో తెలుసా..? అమెరికాలోని బ్రెజిల్ దగ్గర్లోని అమెజాన్ అడవుల్లో. కిచకిచలాడుతూ, చెట్లపై గెంతుతూ.. రంగు రంగుల జీనుతో తిరుగాడుతున్న ఇది పరిశోధకుల కంట్లో పడింది. "అరే.. చూసేందుకు చాలా ముచ్చటగా ఉందే, ఇదేదో కొత్త జాతిలాగా ఉందే..?" అనుకున్నవారు ఇంకేముంది పరిశోధనకు ఉపక్రమించారు.ఈ బుల్లికోతి బరువెంతంటే..?
అన్నట్టు.. ఈ కొత్త జాతి బుల్లి బుజ్జి కోతిగారి బరువెంతో తెలుసా పిల్లలూ..? కేవలం 213 గ్రాములు మాత్రమే. అంటే పావుకేజీకి కూడా తక్కువే. ఇక దీని శరీరం 9.5 అంగుళాల పొడవుంటుందంతే..! దీని పేరేంటంటే.. "మురాస్ శాడిల్ బ్యాక్ టామరిన్స్".. భలే బాగుంది కదూ..?!
పరిశోధకులు యధాలాపంగా పరిశోధన ప్రారంభించారేగానీ.. చివరకు వారు అనుకున్నదే నిజమయ్యింది. వెంటనే దానికి "మురాస్ శాడిల్ బ్యాక్ టామరిన్స్" అని నామకరణం చేసేశారు. అంతటితో వారు ఊరుకుంటారా చెప్పండి.. మేమొక కొత్త కోతిని కనిపెట్టేశామంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. అది సరేగానీ.. ఈ కోతిగారి పేరులో మురాస్‌ను ఎందుకు కలిపారంటే.. ఇప్పుడు వాటిని కనుగొన్న ప్రాంతంలోనే ఒకప్పుడు "మురా ఇండియన్స్" అనే అమెరికా జాతీయులు నివసించేవారట. అన్నట్టు.. ఈ కొత్త జాతి బుల్లి బుజ్జి కోతిగారి బరువెంతో తెలుసా పిల్లలూ..? కేవలం 213 గ్రాములు మాత్రమే. అంటే పావుకేజీకి కూడా తక్కువే. ఇక దీని శరీరం 9.5 అంగుళాల పొడవుంటుందంతే..!అయితే కొత్త కోతి జాతిని కనిపెట్టామన్న సంతోషం ఆ పరిశోధకులకు కాసేపు కూడా మిగల్లేదు. ఎందుకంటే.. ఈ బుల్లికోతుల సంఖ్య చాలా తక్కువగా ఉందనీ, వీటి జాతి ప్రమాదకర స్థితిలో జీవనం సాగిస్తోందని తెలిసింది. అంతేగాకుండా.. బ్రెజిల్ ప్రభుత్వం అతి పెద్ద జాతీయ రహదారిని నిర్మించేందుకు, ఈ కోతులు కనిపించిన ప్రాంతంలోనే గ్యాస్ పైప్‌లైన్లను ఏర్పాటు చేసేందుకు, వంతెనలు కట్టేందుకు పనులు ప్రారంభించింది.దీంతో.. ఈ పనుల కోసం బుల్లికోతులు నివసించే ఆ ప్రాంతంలోని చెట్లను నరికివేస్తోంది. దీంతో కలవరపాటుకు లోనైన మన బుజ్జి కోతులు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయట. అందుకనే వీటిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు వన్యమృగ సంరక్షకులు బ్రెజిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి పిల్లలూ.. మనం కూడా ఈ బుల్లికోతులను కాపాడాలని కోరుకుందామా..?!ఆ సంగతలా కాసేపు పక్కన పెడితే... ఇప్పటివరకూ కోతుల్లో 264 రకాల జాతులను గుర్తించారట పిల్లలూ..! వీటిల్లో అన్నింటికంటే చిన్నది పిగ్మీ మార్మో సెట్. ఇది కేవలం ఆరంగుళాల పొడవు మాత్రమే ఉంటుందట. ఇక అతి బరువైనది ఏదంటే.. మాండ్రిల్ జాతికి చెందినది. ఇది 30 కేజీల బరువుంటుంది. మనుషుల తరువాత పెద్ద గుంపులుగా నివసించే జీవులు ఇవేనట. కనీసం 1300 కోతులు కలిసి జీవిస్తాయట పిల్లలూ..!!